Fake Embassy: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన నకిలీ దౌత్య కార్యాలయం (Fake Embassy) కేసు దర్యాప్తులో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు హర్షవర్ధన్ జైన్ విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా ఎనిమిదేళ్లుగా నకిలీ దౌత్య కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు రూ.300 కోట్ల మేర మోసం జరిగినట్టుగా ఘజియాబాద్ పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. నిందితుడు హర్షవర్దన్ జైన్ గత 10 ఏళ్లలో 162 విదేశీ ప్రయాణాలు చేశాడు. అంతేకాదు, అతడి పేరు మీద అనేక విదేశీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో గుర్తించింది.
ఫేక్ జాబ్స్, హవాలా రాకెట్
ఫేక్ జాబ్స్ రాకెట్‌ను నడిపించాడని, హవాలా మార్గంలో డబ్బు అక్రమ లావాదేవీలు కూడా జరిపాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా, హర్షవర్ధన్ జైన్‌ను ఘజియాబాద్‌లో అతడు అద్దెకు తీసుకున్న రెండు అంతస్థుల భవనంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ బిల్డింగ్‌ను రాయబార కార్యాలయంగా ప్రకటించుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ బిల్డింగ్‌లో నిర్వహించిన సోదాల్లో నాలుగు కార్లపై నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్‌లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. భవనం ముందు ఒక నేమ్‌ప్లేట్‌ను కూడా ఉంచారు. దానిపై ‘గ్రాండ్ డచీ ఆఫ్ వెస్టార్క్టికా’ (Grand Duchy of Westarctica), ‘హెచ్.ఈ. హెచ్.వీ. జైన్ హానరరీ కాన్సల్’ (H E HV Jain Honorary Consul)’ అని రాసి ఉంది. ఈ భవనంపై భారత్, వెస్టార్క్టికా (Westarctica) జెండాలను పెట్టారు. వెస్టార్క్టికా అనేది అంటార్కిటికాలో ఒక గుర్తింపు పొందని ఊహాత్మక దేశం. ప్రపంచంలో ఏ సార్వభౌమ దేశమూ దీనిని ప్రత్యేక దేశంగా గుర్తించలేదు.
దర్యాప్తులో ఏం తేలింది?
ఈ నకిలీ ఎంబసీ పేరిట హర్షవర్ధన్ జైన్ జనాలతో పరిచయాలు పెంచుకుని, తద్వారా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ విధంగా 2017 నుంచి రాయబారి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్టు తేలింది. ఇదొక ఎంబసీ కార్యాలయమని జనాలను నమ్మించేందుకు భవనం వెలుపల చారిటీ కార్యక్రమాలు చేపడుతుండేవాడని గుర్తించారు. నకిలీ ఎంబసీని దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నప్పటికీ, ఈ భవనాన్ని కేవలం ఆరు నెలల క్రితమే అద్దెకు తీసుకున్నాడని పోలీసు అధికారులు గుర్తించారు. మోసంలో భాగంగా జనాలకు దౌత్య కార్యాలయంగా చూపించేందుకు ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్టు నిగ్గుతేల్చాడు. విదేశీ ఉద్యోగాలు, దౌత్య సంబంధాల పేరిట భారీ స్థాయిలో మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కాగా, పోలీసులు నిందితుడు హర్షవర్ధన్ జైన్ కస్టడీ కోరుతూ ఘజియాబాద్ పోలీసులు సోమవారం (జులై 28) కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
ఆధ్యాత్మిక గురువుతో సంబంధాలు!
ఘజియాబాద్‌లోని నకిలీ ఎంబసీపై పోలీసులు జరిపిన సోదాల్లో హర్షవర్ధన్ జైన్‌కు సంబంధించిన ఆసక్తికర ఫొటోలు బయటపడ్డాయి. ఇద్దరు వివాదాస్పద వ్యక్తులతో అతడు దిగిన ఫొటోలను గుర్తించారు. వాళ్లలో ఒకరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి, మరొకరు సౌదీ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగి. కాగా, బాబా చంద్రస్వామి బాబా 1980, 1990లలో భారత రాజకీయ రంగంలో విశిష్ట గుర్తింపు ఉంది. అప్పట్లో మూడు మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, చంద్రశేఖర్, వీపీ సింగ్‌లకు ఆధ్యాత్మిక సలహాదారుడిగా భావించేవారు. అయితే, 1996లో బాబా చంద్రస్వామిపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో, ఆయన అరెస్టు కూడా అయ్యారు. ఆయన ఆశ్రమంలో సోదాలు నిర్వహించగా అద్నాన్ ఖషోగితో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు లభించాయి. అంతేకాదు, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు నిధులు సమకూర్చారంటూ చంద్రస్వామిపై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి.