Telangana:
మెదక్ బ్యూరో: స్వేచ్చ: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో (Telangana) ఉన్న సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలిన దుర్ఘటన గురించి తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో 46 మంది కార్మికులు మృత్యువాతపడగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరణించిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మేరకు రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబు రావు పిల్ దాఖలు చేశారు. జూన్ 30న సంభవించిన ఈ ఘోర పేలుడులో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి తగిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయిల పరిహారం విషయంలో స్పష్టత లేదని, విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆ పిల్‌లో ఆయన కోరారు.
సోమవారం కేబినెట్ ముందుకు..
పాశమైలారం సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ రూపొందించిన నివేదిక రాష్ట్ర కేబినెట్ ముందుకు వెళ్లనుంది. సోమవారం (జులై 28) జరగనున్న కేబినెట్ భేటీలో సిగాచీ ప్రమాదంపై మంత్రివర్గం చర్చించనుంది. నివేదిక ఆధారంగా కంపెనీపై తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమల్లో అనుసరించాల్సిన ప్రమాణాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిగాచీ దుర్ఘటనపై నిపుణుల కమిటీ సిద్ధం చేసిన రిపోర్టు 2 రోజుల క్రితమే సీఎస్‌కు అందింది. సిగాచీ కంపెనీ తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ఘోరం జరిగినట్టు తేల్చింది. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ సూచనలను పరిశీలించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.
Read Also- Viral News: అంబులెన్స్‌లో యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎంతమందంటే?
కమిటీ సూచనలు ఇవే
పరిశ్రమల్లో విపత్తుల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం అత్యవసరమని నిపుణుల కమిటీ నివేదిక సూచించింది. పరిశ్రమలు కట్టుదిట్టంగా భద్రతా ప్రమాణాలు అనుసరించేలా ఈ అథారిటీ నిత్యం పర్యవేక్షించాలని సూచించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో అత్యాధునిక భద్రతా వ్యవస్థలను పరిశ్రమల్లో సిద్ధం చేయాలని సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి ఉపాధి పొందే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సలహా ఇచ్చింది. ఇక, ఇండస్ట్రియల్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాంతాలలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చింది. అగ్నిమాపక కేంద్రాలను విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చేయాలని పేర్కొంది. ప్రమాద సమయాల్లో ఏవిధంగా వ్యవహరించాలనేదానిపై సిబ్బందికి సమగ్ర ట్రైనింగ్ ఇవ్వాలని పేర్కొంది.