Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నా.. ఇద్దరికంటే ఎక్కువగా పిల్లలు ఉండటంతో నైరాశ్యానికి గురవుతున్నారు. వారికి 1995 లో చేసిన పంచాయతీరాజ్ చట్టం గొడ్డలిపెట్టుగా మారింది. దానిని సవరించాలని గతంలో గత ప్రభుత్వాలకు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ చొరవ తీసుకోలేదు. దీంతో పంచాయతీ ఎన్నికలు(Local body elections) జరిగినప్పుడల్లా గెలిచినవారిపై ఓడినవారు కోర్టులకు వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ప్రజాప్రభుత్వంపై ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. మార్పులు చేసి తమకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
కోర్టుకు వెళ్తున్న ఘటనలు
జనాభా నియంత్రణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం 1995 మే 30న పంచాయతీరాజ్ చట్టం(Panchayat Raj Act)లోని 21వ పేజీలో 3వ అంశంగా చేర్చారు. దీంతో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగినవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో చాలా మంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వెనుకంజ వేస్తున్నారు. ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా ఓటమిపాలైన వారు కోర్టుకు వెళ్తున్న ఘటనలు ఉన్నాయి. అవికూడా ప్రతిసారి ఎన్నికల సమయంలో నిత్యకృత్యమయ్యాయి. కోర్టులు కొన్ని సార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్లీ వారు పై కోర్టులకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణను అసెంబ్లీ సమావేశాల్లో చేయడమేనని పలువురు పేర్కొంటున్నారు. అదే చట్టం చేసి 30 ఏళ్లుగడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సవరణ చేయలేదు.
Alllso Read: Ramchander Rao: కాంగ్రెస్ యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుంది
ఇబ్బందులు తప్పడం లేదు
ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్(KCR) కు 1995 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ చట్టంతో పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లోనూ ఇద్దరుకంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హులు అని పేర్కొన్నారు. అయితే 2019లో గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనలు సడలించింది. దీంతో పోటీచేసేవారికి ఊరట లభించింది. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి నిబంధనలు సడలించలేదు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు 1995 చట్టం చేసిన చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చేశారు. పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. అదే డిమాండ్ తెలంగాణ(Telangana)లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్(Congress) ప్రభుత్వం దృష్టికి సైతం ఈ అంశాన్ని పలు సందర్భాల్లో తీసుకొచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వారికో న్యాయం వీరికో న్యాయమా
ఎంపీలు(MP), ఎమ్మెల్సీ(MLC), ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసేవారికి, నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసే నేతలకు 1995చట్టంతో సంబంధం ఉండదు. వారికి ఎంతమంది పిల్లలు ఉన్నా అవకాశం కల్పిస్తారు. చట్టాలు సైతం చేస్తారు. కానీ గ్రామస్థాయిలో పోటీచేసే సర్పంచ్, ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC)లకు అవకాశం కల్పించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారికి ఒకన్యాయం, కిందిస్థాయి వారికి మరోన్యాయమా అనేది సర్వత్రా చర్చజరుగుతుంది. ఈ నెల 25న(శుక్రవారం) కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో 1995 పంచాయతీరాజ్ చట్టంకు సవరణలు చేసేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అంశాన్ని చర్చిస్తారా? లేకుంటే గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే అవలంభిస్తారా? చంద్రబాబు చేసిన 1995 చట్టంనే కొనసాగిస్తారా? అనేది చూడాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేస్తే బాగుంటుందని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు. కేబినెట్ పైనే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు సుముఖంగా ఉన్న ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!