PM Modi: భారత్- యూకే మధ్య గురువారం చారిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. ఉచిత వాణిజ్యానికి ఉద్దేశించిన ‘కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. కీలకమైన ఈ డీల్ పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ – యూకే మధ్య కుదిరిన ఉచిత వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల పరస్పర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య భద్రతా సహకార ప్రాధాన్యతను చాటిచెబుతోందని అన్నారు. ఒప్పందం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు, ఆయన ప్రభుత్వానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు.
జూన్ 12న అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో మరణించిన బ్రిటన్ పౌరులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. బ్రిటన్‌లో నివసిస్తున్న భారత మూలాలున్న వ్యక్తులు ఇరు దేశాల మధ్య బంధానికి వారధిగా నిలుస్తారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయులు ఇండియా నుంచి కేవలం వంటలను మాత్రమే తీసుకురాలేదు. సృజనాత్మకత, నిబద్ధత, విలువలను కూడా తీసుకొచ్చారు. భారత మూలాలున్న వ్యక్తుల అసాధారణమైన కృషి బ్రిటన్ అభివృద్ధిలో కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాదు. సంస్కాృతిక, క్రీడలు, ప్రజాసేవలోనూ స్పష్టంగా కనిపిస్తోందని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఉచిత వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్‌లో టెక్స్‌టైల్, ఫుట్‌వేర్, రత్నాలు–ఆభరణాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువుల తయారీ రంగాలకు భారీ ప్రయోజనం చేకూర్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ రైతులు కూడా లాభపడతారన్నారు. ఇకపై భారతీయ వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్‌లో సుంకాలు లేకుండానే ప్రవేశించేందుకు అవకాశం లభించడం ఇందుకు కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Also- Viral News: జర్నలిస్టుల ‘స్క్విడ్ గేమ్’.. వైరల్ వీడియో ఇదిగో!
ఉగ్రవాదంపై డబుల్ గేమ్స్ వద్దు
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటలేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. పరస్పర ఇదే నమ్మకాన్ని కలిగివుండాలన్నారు. తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం పరచకుండా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొని, విధ్వంసం చేయడానికి ప్రయత్నించే వారు బాధ్యత వహించేలా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా పాకిస్థాన్ పేరు ఎత్తకుండానే ఆ దేశంపై మోదీ ఈ విమర్శల దాడి చేశారు. ఇక, ఆర్థిక నేరగాళ్లను వెనక్కు రప్పించే (ఎక్స్‌ట్రడిషన్) విషయంలో భద్రతా సంస్థల మధ్య సహకారం మరింతగా బలపడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
శాంతి పునరుద్ధరణకు మద్దతు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న పలు వివాదాలపై భారత్ దృక్పథాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం తెలియజేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, పశ్చిమాసియా పరిణామాలపై భారత్ ఇప్పటికే తన ఉద్దేశాలను తెలియజేసిందని అన్నారు. వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణకు మద్దతుగా నిలుస్తామని, అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వడం అత్యవసరమని మోదీ వ్యాఖ్యానించారు. అభివృద్ధిని డిమాండ్ యుగం ఇదని, విస్తరణవాదానికి చోటులేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఉచిత వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూకేలోనే ఉన్నారు. గురువారం (జులై 24) తిరుగుపయనం కానున్నారు.
Read Also- Walking Tips: రోజుకు 7 వేల అడుగులు నడిస్తే ఆరోగ్య అద్భుతాలు!