Indian Origin: ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలలో గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) టాప్ లో ఉంటాయి. ఆ రెండు కంపెనీల్లో పని చేయాలన్నది చాలా మంది టెక్కీల డ్రీమ్ గా ఉంటుంది. ఒకసారి ఆయా కంపెనీల్లో జాబ్ సాధిస్తే ఇక కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదని అందరూ భావిస్తుంటారు. అయితే గూగుల్ లో 16 ఏళ్ల పాటు పనిచేసిన భారత సంతతి టెక్కీ అమర్ సుబ్రహ్మణ్య (Amar Subramanya).. ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరారు. వర్క్ పరంగా ఆ రెండు కంపెనీల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెండు టాప్ కంపెనీల్లో వర్క్ అనుభవం గురించి ప్రస్తావించడంతో సుబ్రహ్మణ్య పోస్ట్.. తెగ వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది.
మైక్రోసాఫ్ట్ పని సంస్కృతి భేష్..
గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ కు వచ్చేసిన భారత సంతతి టెక్కీ అమర్ సుబ్రహ్మణ్య.. అక్కడ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ (AI)గా నియమితులయ్యారు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ రంగంలో తనకు ఉన్న 24 ఏళ్ల అనుభవంతో పాటు.. మైక్రోసాఫ్ట్, గూగుల్ లోని వర్క్ సంస్కృతిని లింక్‌డ్ ఇన్ (Linkd In) ద్వారా పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ లో కొత్త పదవిలో చేరానని మీతో పంచుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. నా ఈ కొత్త పాత్రలో చేరి వారం గడిచిపోయింది. నేను ఇప్పటికీ చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇక్కడి పని సంస్కృతి.. ఎంతో ఉత్సాహంగా, తక్కువ అహం, ఆశయంతో నిండి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
స్టార్టప్ కంపెనీలను గుర్తుకుతెస్తోంది!
బెంగళూరు విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ పట్టా అందుకున్న సుబ్రహ్మణ్య.. మైకోసాఫ్ట్ లో పని సంస్కృతి ఒక స్టార్టప్ కంపెనీని గుర్తుకు తెస్తోందని అన్నారు. మారుతున్న టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకొని ఎంతో చైతన్యంతో ఇక్కడి టీమ్ ముందుకు సాగుతోందని అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల (Sathya Nadella), మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ లతో జరిగిన సంభాషణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు.
Also Read: Nushrratt Bharuccha: ఇండస్ట్రీలో లింగ వివక్ష.. హీరోలను అడ్డంగా బుక్ చేసిన స్టార్ నటి!
నెటిజన్ల సూటి ప్రశ్నలు!
అయితే భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం పెట్టిన తాజా పోస్ట్.. నెట్టింట కొత్త చర్చకు లేవనెత్తింది. 16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు బయటకొచ్చి ఆ కంపెనీపై పరోక్షంగా నిందలు వేస్తున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మైక్రో సాఫ్ట్ లో తక్కువ ఇగో ఉందని చెప్పడం ద్వారా.. గూగుల్ లో ఉద్యోగుల మధ్య రాగ ద్వేషాలు అధికంగా ఉంటాయని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గూగుల్ ఉద్యోగులు సైతం దీనిపై రియాక్ట్ అవుతుండటంతో అటు మైక్రోసాఫ్ట్ జాబ్ హోల్డర్స్ దీటుగా బదులిస్తున్నారు. మెుత్తంగా అమర్ సుబ్రహ్మణ్య పెట్టిన పోస్ట్.. రెండు టాప్ కంపెనీ ఉద్యోగుల మధ్య చిచ్చురేపిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే గూగుల్ నుండి సుబ్రహ్మణ్యం సహా 24 మంది ఇంజనీర్లు, ఏఐ పరిశోధకులను మైక్రో సాఫ్ట్ చేర్చుకుంది.