Walking Tips: డైలీ వాకింగ్‌తో ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యం, బీపీ నియంత్రణ, బరువు నియంత్రణ, కేలరీలు బర్నింగ్, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ ఇలా ఒకటా రెండా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే, రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. వాకింగ్ చేస్తే దక్కే ప్రయోజనాలపై ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో కూడా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రతి రోజూ సుమారు 7,000 అడుగులు నడిస్తే అనేక రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుందని తేలింది.
ఈ మేరకు 2025 జులై 23న ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌లో ఒక అధ్యయన పత్రం ప్రచురితమైంది. అనేక అనారోగ్య సమస్యలపై నడక ప్రభావాన్ని ఈ అధ్యయనం సమగ్రంగా విశ్లేషించింది. అధ్యయనంలో భాగంగా 160,000 మందికి పైగా పెద్దవయస్కుల నుంచి డేటా సేకరించి విశ్లేషించారు.
ప్రతి రోజూ 7,000 అడుగులు నడిస్తే మరణం ముప్పును 47 శాతం మేర తగ్గిస్తుందని అధ్యయనం చెప్పింది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 25 శాతం, క్యాన్సర్ సోకే ప్రమాదం 6 శాతం తక్కువ చేస్తుందని పేర్కొంది. ఇక టైప్ 2 షుగర్ ముప్పు 14 శాతం, మెదడు ఆరోగ్యానికి ముప్పు (డిమెన్షియా) 38 శాతం, మానసిక ఆందోళన (డిప్రెషన్) 22 శాతం మేర తగ్గిపోతుందని అధ్యయనం వివరించింది. ఇక, వృద్ధులు జారి కిందపడిపోయే ముప్పును కూడా 28 శాతం మేర తగ్గి్స్తుందని వివరించారు. మొత్తంగా చూస్తే ప్రతి రోజూ 7,000 అడుగులు నడిస్తే ఆరోగ్యంపై చాలా గొప్ప సానుకూల ప్రభావం చూపుతుందని వివరించింది.
4 వేల అడుగులు నడిచినా మేలే
7 వేల అడుగులు కాకపోయిన ప్రతి రోజూ కేవలం 4,000 అడుగులు నడిచినా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అధ్యయనం సూచించింది. 2,000 అడుగుల నడవడం కన్నా 4 వేల అడుగులు నడవడం ఉత్తమమని పేర్కొంది. మునుపటి అధ్యయనాలలో కూడా 7 వేల అడుగుల వాకింగ్‌తో గుండె ఆరోగ్యం లేదా మరణం ముప్పు తగ్గుతుందని గుర్తించినట్టు పేర్కొంది.
7,000 అడుగులే ఎందుకు?
ప్రతిరోజూ కేవలం 2,000 అడుగులు నడవడాన్ని తక్కువ యాక్టివిటీగా వైద్యులు పరిగణిస్తున్నాయి. దీనితో పోల్చితే, 4,000 అడుగుల వాకింగ్ చేసేవారు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే, గుండె జబ్బుల కోణంలో చూసినప్పుడు 7,000 అడుగుల దూరం నడిచినప్పుడు చక్కటి ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే, ప్రస్తుతం 10,000 అడుగుల కంటే 7,000 అడుగుల వాకింగ్ మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ స్థాయిలో యాక్టివిటీ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. 7 వేల అడుగుల కంటే ఎక్కువ దూరం నడిచినా ప్రయోజనాలు అంతగా ఉండవని చెబుతున్నారు. 10 వేల అడుగుల నడకపై అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు లేవని వైద్య నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఎన్ని అడుగులు నడవాలనే అంశంపై నిర్వహించిన 57 అధ్యయనాలు పరిశీలించగా, వాటిలో 31 అధ్యయనాలు రోజువారీ నడక, ఆరోగ్య ఫలితాల మధ్య సంబంధంపై సమగ్ర అధ్యయనం చేశాయి. గుండె ఆరోగ్యం, బీపీతో పాటు పలు అనారోగ్య సమస్యల విషయంలో వాకింగ్ చక్కగా పనిచేస్తుండగా, క్యాన్సర్, డిమెన్షియా లాంటి కొన్ని సమస్యల విషయంలో వాకింగ్ ద్వారా లభించే ఫలితాల్లో ఖచ్చితత్వం తక్కువ అని అధ్యయనకారులు పేర్కొన్నారు. కాబట్టి, ప్రతిరోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నామో లెక్కించుకోవడం చాలా ముఖ్యమని, ఫిజికల్ యాక్టివిటీ మాపింగ్ కీలకమని పేర్కొన్నారు.