Shubham Gill: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం నాల్గో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో విఫలమైన టీమిండియా యువ సారథి శుభ్ మన్ గిల్.. వరుసగా నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరాడు. తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన అతడు అనూహ్యాంగా 3, 4 (తొలి ఇన్నింగ్స్) టెస్టుల్లో విఫలం కావడంపై మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అతడి ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు.
ఫామ్ కోల్పోడానికి కారణమదేనా!
బుధవారం ప్రారంభమైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గిల్ 12 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Benstokes) సంధించిన బంతికి అడ్డంగా దొరికిపోవడంతో భారత్ 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే తొలి రెండు టెస్టుల్లో బాగా రాణించిన గిల్.. ఇలా అనూహ్యంగా ఫామ్ కోల్పోవడంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar), ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ (Jonathan Trott) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘లార్డ్స్ (మూడో టెస్ట్ సందర్భంగా)లో గిల్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అది అతడి బ్యాటింగ్ ఫామ్ పై ప్రభావం చూపి ఉండొచ్చు. మూడో రోజు ఏదో జరిగింది. గిల్ బ్యాటింగ్ శైలి కూడా మారిపోయింది. డిఫెన్సివ్ షాట్లు ఆడి అతడు ఔట్ అయ్యాడు’ అని అన్నారు.
ఇంగ్లాండ్ మాజీ తీవ్ర వ్యాఖ్యలు
మరోవైపు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ (Jonathan Trott) మాట్లాడుతూ.. గిల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ లో అతడు విలన్ గా మారిపోయాడని విమర్శించారు. అతడు బ్యాటర్ గా విఫలం కావడంతో పాటు జట్టును నడిపిస్తున్న తీరుపై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందని ట్రాట్ చెప్పుకొచ్చారు. ఈ విమర్శల నుంచి బయటపడటానికి గిల్ కు ఎంత సమయం పడుతుందో వేచి చూడాలని వ్యాఖ్యానించారు. అయితే గిల్ ను ఉద్దేశించి విలన్ అనే పదాన్ని ట్రాట్ వినియోగించడంపై క్రికెటర్ వర్గాలు మండిపడుతున్నాయి. ఒక్క టెస్టుతో అతడి బ్యాటింగ్ ను జడ్జి చేసేస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan: హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
నాల్గో టెస్టులో భారత్ పరిస్థితేంటి?
ఇక ఇంగ్లాండ్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ 264-4 స్కోరుతో మంచి స్థితిలోనే ఉంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46 జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి టెస్టు తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ సైతం 61 పరుగులతో రాణించాడు. రిషబ్ పంత్ 37 పరుగుల వద్ద గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (19*), శార్దుల్ ఠాకూర్ (19*) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, లియమ్ డాసన్ కు తలో వికెట్ తగ్గింది.