Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతున్నది. విచారణకు పిలిచి సిట్ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పదే పదే సిట్ కార్యాలయానికి పిలిపిస్తూ గంటల తరబడి కూర్చోబెడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న తాను దీని వల్ల ఇబ్బంది పడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. కాగా, ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కల్పించిన రక్షణను తొలగించాలని సిట్(SIT)అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. దర్యాప్తునకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదని న్యాయస్థానానికి నివేదించనున్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
దీనిపై కేసులు నమోదు కాగానే ఆయన అమెరికా పారిపోయారు. విశ్వప్రయత్నాల అనంతరం సిట్ అధికారులు ఆయనను స్వదేశానికి రప్పించారు. కాగా, ఇక్కడికి వచ్చే ముందే ప్రభాకర్ రావు(Prabhakar Rao)తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ(Supreme Court)సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ తాత్కాలిక రక్షణ కల్పించింది.
Also Read: Rajeev Kanakala: చిక్కుల్లో నటుడు రాజీవ్ కనకాల.. పోలీసుల నోటీసులు.. మ్యాటర్ ఏంటంటే?
వెనక సూత్రధారులు ఎవరు
అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను ఆదేశించింది. ఈ క్రమంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావును పలుమార్లు సిట్ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. అయితే, ప్రభాకర్ రావు తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతూ వచ్చారు తప్పితే కేసులోని కీలక వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ వ్యవహారం వెనక సూత్రధారులు ఎవరని ప్రశ్నిస్తే సూటిగా సమాధానం చెప్పకుండా తానేం చేశానో మొత్తం తన పై అధికారులకు తెలుసని మాత్రమే జవాబు ఇస్తూ వచ్చారు. ఫలానా నెంబర్లు ట్యాప్ చేయాలని కూడా తాను ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఎన్నిరకాలుగా ప్రశ్నించినా ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలే చెబుతుండడంతో సుప్రీం కోర్టు ఆయనకు కల్పించిన రక్షణను తొలగించేలా చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
సుప్రీం కోర్టులో పిటిషన్
ఈ క్రమంలోనే ఇటీవల వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్,(DCP Vijay Kumar)సిట్ ఇన్ఛార్జ్ వెంకటగిరిలు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో దీనిపై చర్చలు కూడా జరిపి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రభాకర్ రావు(Prabhakar Rao) విచారణ పేర సిట్ అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తనను గంటల తరబడి కూర్చోబెడుతుండటంతో శారీరకంగా బాధ పడాల్సి వస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు ఆగస్టు 4న విచారణ జరుపనున్నట్టు సమాచారం.
ఆగస్టు 5న విచారణ
కాగా, ప్రభాకర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేయడంతో సిట్ అధికారులు ఆయనకు కల్పించిన రక్షణపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని నిశ్చయించారు. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి సేకరించిన వాంగ్మూలాలను సుప్రీం కోర్టుకు నివేదించనున్నారు. బాధితులు చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో తెలియ చేయనున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభాకర్ రావు మాత్రం నోరు తెరవడం లేదని కోర్టుకు విన్నవించనున్నారు. దీనిపై ఆగస్టు 5న విచారణ జరుగనున్నట్టు సమాచారం.
Also Read: Herbal Teas: వర్షాకాలంలో జీర్ణ సమస్యలా? ఈ హెర్బల్ టీలు తాగండి.. రాళ్లు తిన్నా అరిగిపోతాయ్!