Rajeev Kanakala: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. భూ లావాదేవీలకు సంబంధించి ఆయనకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు అదే కేసులో సినీ నిర్మాత విజయ్ చౌదరి పైనా హయత్ నగర్ పోలీసు స్టేషన్ (Hayath Nagar Police Station)లో కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 421 వెంచర్‌లో రాజీవ్ కనకాల కు గతంలో ఓ ఫ్లాట్ ఉండేది. ఈ ఫ్లాట్‌ను ఆయన కొన్ని నెలల క్రితం నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారు. రిజిస్ట్రేషన్ సైతం చేయించారు. ఈ క్రమంలో సదరు నిర్మాత ఆ ఫ్లాట్ ను మరో వ్యక్తికి విక్రయించారు. ఎల్బీ నగర్ కు చెందిన శ్రవణ్ రెడ్డికి రూ.70 లక్షలకు దానిని అమ్మివేశారు.
చంపేస్తానని బెదిరింపు
అయితే శ్రవణ్ రెడ్డి.. తను కొనుగోలు చేసిన ఫ్లాట్ ను పరిశీలించేందుకు వెళ్లగా.. అది ఎక్కడా కనిపించలేదు. రిజిస్ట్రేషన్ లో చెప్పిన విధంగా స్థలం తాలుకూ ఆనవాళ్లు సైతం అతడికి కనిపించలేదు. దీంతో లేని స్థలాన్ని సృష్టించి తనను మోసం చేశారని శ్రవణ్ రెడ్డి భావించారు. అయితే ఈ విషయమై నిర్మాత విజయ్ చౌదరిని బాధితుడు సంప్రదించగా.. ఆయన సరైన తీరులో స్పందించలేదని తెలుస్తోంది. స్థలంపై వివాదం నడుస్తోందని ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని నిర్మాత చెప్పినట్లు సమాచారం. దీంతో బాధితుడు గట్టిగా నిలదీయడంతో అంతు చూస్తానని కూడా బెదిరించారని బాధితుడు శ్రవణ్ ఆరోపించారు.
Also Read: CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం
రాజీవ్‌కు వాటిపై ప్రశ్నలు?
శ్రవణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు తొలుత హయత్ నగర్ పోలీసులు.. నిర్మాత విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముందుగా స్థలాన్ని విక్రయించిన నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించారు. అయితే తనకు ఆరోగ్యం బాగోనందున తర్వాత విచారణకు హాజరవుతానని నటుడు తెలియజేసినట్లు సమాచారం. కాగా ఈ వివాదంపై ఆయన బహిరంగంగా స్పందించాల్సి ఉంది. ఇక ఫ్లాట్ కు సంబంధించి అధికారిక డాక్యుమెంట్లు, మ్యూటేషన్ రికార్డులు, స్థల పరిమితి వివరాలపై ఆయన్ను పోలీసులు విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోలీసుల నుంచి రాజీవ్ కనకాలకు నోటీసులు వెళ్లిన విషయం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు తావిస్తోంది. విచారణ అనంతరం పోలీసులు యాక్షన్ ఏ విధంగా ఉంటుందోనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.