YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ పార్టీలు ఎంత బద్ధశత్రువులో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది అధికార టీడీపీ ఎమ్మెల్యే.. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రిని కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. మరీ ముఖ్యంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న, రెండ్రోజులకోసారి సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేత చీవాట్లు తినే ఎమ్మెల్యే.. ప్రత్యర్థి పార్టీ ముఖ్య నేతతో భేటీ అయితే రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సరిగ్గా ఇదే రాష్ట్ర రాజకీయాల్లో జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao).. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో (Peddireddy Ramachandra Reddy) భేటీ అయ్యారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఇద్దరి కలయిక జరిగింది. ఈ భేటీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన మంతనాల వివరాలు బయటికి తెలియకపోయినా, ఈ భేటీపై పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే.. సాధారణంగా ప్రత్యర్థి పార్టీల నేతలు ఇలా కలుసుకోవడం అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ సమావేశం వెనుక ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? లేక అది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Read Also- Rana Daggubati: ఈ సారి ఖచ్చితంగా రావాల్సిందే.. రానాకు ఈడీ మళ్లీ సమన్లు
జంప్ అవుతారా?
కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీలో అంతర్గత విభేదాలతో ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni)తో ఆయనకు సఖ్యత లేదన్నది జగమెరిగిన సత్యమే. ఈ నేపథ్యంలోనే కొలికపూడిని సీఎంవోకు పిలిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు క్లాస్ తీసుకున్నారు. ఒకట్రెండు సార్లు క్షమాపణ కూడా చెప్పారు ఎమ్మెల్యే. అయినా సరే రెండ్రోజులకో వివాదం.. మూడ్రోజులకో రచ్చ లేనిదే ఆయన ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. పోనీ కొలికపూడికి ఇదంతా కొత్తా అంటే అస్సలు కానే కాదు. ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారని ప్రకటన వచ్చినప్పట్నుంచి ఇవాళ్టి వరకూ ఏదో ఒక రచ్చకు వెళ్తూనే ఉన్నారు.. హైకమాండ్ దగ్గర చీవాట్లు, హెచ్చరికలు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కొలికపూడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా సీఎం చంద్రబాబు భావించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఎందుకో అదంతా ఆచరణలోని రాలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి (Telugu Desam) గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ ప్రచారంలో భాగంగానే కొలికపూడి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డిని కలిశారనే చర్చ కూడా పెద్ద ఎత్తునే జరుగుతున్నది. అయితే, దీనిపై ఇరు పక్షాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దిరెడ్డిని కలిసి, మంతనాలు జరిపిన కొలికపూడి!
పసుపు కండువా పక్కనెట్టి.. వైసీపీ కండువా కప్పుకుంటారని చర్చ! pic.twitter.com/ocUsRG7Vmo
— Nagarjuna (@pusapatinag) July 23, 2025
ఎందుకనీ.. ఏమై ఉంటుంది?
వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అస్సలు ఉండరు. ఎవరు ఏ పరిస్థితుల్లో శత్రువులు అవుతారో.. ఎప్పుడు మిత్రులు అవుతారో ఊహించలేని పరిస్థితి. బహుశా పెద్దిరెడ్డి-కొలికపూడి భేటీ కూడా ఇందులో భాగంగానే జరిగి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రేపొద్దున్న పసుపు కండువా పక్కనెట్టి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నా అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. కాగా, కొలికపూడి శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికారులపై బహిరంగ విమర్శలు చేయడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వంటివి ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ వివాదాల నేపథ్యంలో, ఆయన టీడీపీలో కొనసాగడం కష్టంగా మారిందని కూడా అంచనాలున్నాయి. మరోవైపు.. పెద్దిరెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి (MP Midhun Reddy) రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించే విషయమై పెద్దిరెడ్డి రాజమండ్రికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగానే కొలికపూడితో కలుసుకున్నారు. అయితే, వీరి మధ్య రాజకీయ మంతనాలు జరిగాయనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ కొలికపూడి?
కొలికపూడి శ్రీనివాసరావు 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు అమరావతి జేఏసీ కన్వీనర్‌గా అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడిపిన విద్యావంతుడు. అమరావతి ఉద్యమం సమయంలోనే చంద్రబాబుకు దగ్గరై, టీడీపీలో చేరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో అత్యంత కీలక నేతలలో ఒకరు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పార్టీలో బలమైన పట్టు ఉన్న నేత. అలాంటి వ్యక్తినే కొలికపూడి కలిసే సరికి రాష్ట్ర రాజకీయాల్లో చిత్రవిచిత్రాలుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం, ఈ భేటీపై అధికారిక స్పందన లేనందున, దీని వెనుక ఉన్న అసలు కారణాలు, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మొత్తానికి ఈ ఒక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
Read Also- Fisherman Missing: మానుకోట జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు