Salaries Delay: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న దాదాపు 13 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి టోకెన్ జనరేట్ కాకపోవడం వల్ల ఈ జాప్యం జరుగుతుందని సమాచారం.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు..
ఉపాధి హామీ పథకంలో 7,471 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 400 పైగా ఏపీఓలు, 2,150 మంది టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏలు), 850 మంది కంప్యూటర్, అకౌంట్స్ ఆపరేటర్లు, 340 ఈసీలు, 550 మంది అటెండర్లు పనిచేస్తున్నారు. దీంతోపాటు మండలాలు, జిల్లా కేంద్రంలో ఉపాధి సిబ్బందితో పాటు సాట్ (సోసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌ఫరెన్సీ)లో 250 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, ఈఎంఐలు వంటి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుకు వెళ్లేందుకు కనీసం పెట్రోల్, ఆటో ఛార్జీలు కూడా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.
అధికారుల హామీలు..
‘రేపు మాపంటూ’ ఉన్నతాధికారులు కాలం వెల్లదీస్తున్నారే తప్ప, తమ కష్టాలు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉపాధి హామీ జేఏసీ ఉద్యోగులు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి విన్నవించగా, వారం రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చినా వేతనాలు అందలేదని ఉద్యోగ సంఘం నాయకులు చెబుతున్నారు. గత నెల 17న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి, సామాజిక తనిఖీ వేదిక సిబ్బంది జీతాల కోసం రూ. 5.14 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది.
ఆర్థిక శాఖ కూడా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా టోకెన్ జనరేట్ చేయకపోవడం వల్లే జీతాలు ఆలస్యమవుతున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం ‘స్పర్శ’ ద్వారా వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్ల కొంత జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో వేతనాలు పడుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ వేతనాలు వచ్చేవరకు ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన తొలగే అవకాశం లేదు.
Also Read: Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?