Check Dams: వాగుల్లో.. వంకల్లో వృథాగా పోతున్న వర్షపు నీటికి అడ్డుకట్ట వేయాలి. భూగర్భ జలాలు పెంచాలనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం (Government) చెక్ డ్యాముల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నది. కొండల వద్ద సైతం నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నది. ఉపాధిహామీ నిధులతో నిర్మాణం చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలో వెయ్యికి పైగా నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
భూగర్భజలాలు పెరిగితే ప్రజలకు సంవృద్ధిగా నీరు లభిస్తుందని భావిస్తుంది. వర్షాల సమయంలో నీరు వృథాగా పోకుండా అడ్డుకుని నిలువచేయాలని ప్రణాళికలు రూపొందిస్తూ అందుకు అనుగుణంగా చెక్ డ్యాములు నిర్మించాలని భావిస్తున్నది. ఉపాధిహామీ నిధులతో నిర్మించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మండలానికి రెండు చొప్పున నిర్మించాలని, తొలుత ఎక్కడైతే అవసరమో గుర్తించి ఆయా గ్రామాల్లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నది.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
రాష్ట్ర వ్యాప్తంగా1128 చెక్ డ్యాములు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే అధికారులకు మార్గదర్శకాలు సైతం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి 5 లక్షలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. వాగులు, వంకలతో పాటు గుట్ట వద్ద సైతం చెక్ డ్యాముల నిర్మాణం చేపడితే అక్కడ సైతం నీరును నిలవచేయడంతో ఫారెస్టు సైతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, త్వరలోనే పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అవకతవకలు లేకుండా పకడ్బందీగా చర్యలు
గత ప్రభుత్వాలు చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టాయి. అయితే, పర్యవేక్షణ లోపంతో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ ఎంక్వయిరీ చేశారు. అయితే చెక్ డ్యాముల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం పర్యవేక్షణ చేయనున్నారు. అంతేగాకుండా గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణంపై గ్రామసభల్లో తీర్మానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చెక్ డ్యాముల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఏ మండలంలోని ఏ గ్రామంలో చెక్ డ్యాముల (Check Dams) నిర్మాణం చేపట్టాలనేదానిపై త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇది సఫలీకృతం అయితే ఫేజ్ ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో భూగర్భజలాలు పెరగనున్నాయి.
‘ఉపాధి’ నిధులతో చెక్ డ్యాముల నిర్మాణం శశికుమార్, జాయింట్ కమిషన్, ఈజీ ఎస్
ఉపాధిహామీ పథకంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడుతున్నాం. వ్యవసాయ అనుబంధ పనులు సైతం చేపట్టాం. అయితే నూతనంగా వర్షపు నీరు వృథా కాకుండా అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని లక్ష్యంతో చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. మండలానికి రెండు నిర్మించాలని ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నాం. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే గ్రామాలను ఎంపిక చేసి చెక్ డ్యాముల నిర్మాణం చేపడతాం. గుట్టల వద్ద సైతం చెక్ డ్యాములు నిర్మించి జాలువారే నీటిని అరికట్టబోతున్నాం.
Also Read: Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?