Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో నటించిన భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో.. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ హుషారుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. మంగళవారం మంగళగిరిలో మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్ర విశేషాల గురించి చెబుతూ..
‘‘భీమ్లా నాయక్ టైమ్‌లో టికెట్ల రేట్లు తగ్గించినందుకు నిరుత్సాహ పడలేదు. ఈ రోజు టికెట్ల ధరలు పెరిగినందుకు ఆనందపడటం లేదు. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకోవడమే. అలాగే ప్రత్యేకించి నా సినిమాకే ఇస్తే ఆనందించేవాడిని కాదు. అన్ని సినిమాలకు ఇస్తూనే ఉన్నారు. నాకు ఇవ్వకపోతే వివక్ష అవుతుంది.
Also Read- Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ సినిమా చేయడానికి కారణమిదే..
నాకు ఏ సినిమా విడుదల అవుతున్నా నెర్వస్‌నెస్ ఉండదు. ఎందుకంటే, నేను చేసేటప్పుడే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను. ఒకవేళ సినిమా ఏదైనా తేడాగా ఉంటే, నేను ముందే చెప్పేస్తాను. అందుకే నాకు గిల్ట్ ఉండదు. ‘తొలిప్రేమ, గబ్బర్ సింగ్’ సినిమాల టైమ్‌లో కూడా నేను ఒక్కడినే కూర్చుని ఉన్నాను. కానీ ‘భీమ్లా నాయక్’ టైమ్‌లో మాత్రం నన్ను పార్టీకి పిలిచారు. ఎందుకంటే, 10, 15 రూపాయల టికెట్ల ధరలతో కూడా సినిమాకు కలెక్షన్స్ బాగా వచ్చాయని పార్టీ ఇచ్చారు. నా జీవితంలో అదే మొదటిసారి పార్టీకి అటెండ్ అవడం.
మా కూటమి ఎమ్మెల్యేలందరూ అడిగితే మాత్రం వారి కోసం ఒక ప్రత్యేక షో వేయిస్తాను. నాకు ఇప్పటి వరకు ఈ ఆలోచన లేదు కానీ, వాళ్లు అడిగితే మాత్రం కచ్చితంగా షో వేయిస్తాను. సీఎంగారి కోసం అంటే.. ఆయన మహా అయితే ఓ ఐదు నిమిషాలు చూస్తారేమో. ఆయన అంత బిజీగా ఉంటారు. అందులోనూ ఆయన నన్ను రోజూ చూస్తూనే ఉంటారుగా. (నవ్వుతూ)
జానీ సినిమా ఫెయిల్యూర్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ సినిమా మొదటి ఆట పడగానే అందరూ డిస్ట్రిబ్యూటర్లు నా చుట్టూ చేరారు. మాకు డబ్బులు రావడం లేదని గోల చేశారు. అంతకు ముందు సినిమాలకు డబ్బులు వచ్చినప్పుడు వారు నాకేం ఇవ్వలేదు కదా.. అని నేనేం ప్రశ్నించలేదు. నాకు వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశా. పైన రూ. 15 లక్షలు అప్పు చేశా. అప్పుడే అనుకున్నా.. అన్ని బంధాలు ఆర్ధిక బంధాలే అని. ఆ సినిమా అనుభవం నాకు పొలిటికల్‌గా చాలా హెల్ప్ చేసింది. 2019లో ఓడిపోతే మళ్లీ నాకు అదే గుర్తుకువచ్చింది.
Also Read- Pawan Kalyan: నాగబాబు మంత్రి పదవిపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్
రత్నంలాంటి వ్యక్తి, ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసిన నిర్మాత.. ఈ రోజు సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు పడుతుంటే చాలా బాధేసింది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌కు నేను దిగాను. ‘జానీ’ టైమ్‌లో నేను ఫేస్ చేశాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
ఈ సినిమా క్లైమాక్స్‌ను నేను కొరియోగ్రఫీ చేశాను. దాని కోసం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే, పాలిటిక్స్‌లో ఉన్నాను, సినిమా సరిగా చేయడేమో అని అంతా అనుకుంటారని, ప్రత్యేకించి శ్రద్దపెట్టి చేశాను. ఆ క్లైమాక్స్ సన్నివేశం నా హార్ట్‌కి బాగా దగ్గరైంది.
‘హరి హర వీరమల్లు’ పార్ట్ 2కి సంబంధించి 20 నుంచి 30 శాతం పూర్తయింది. మిగతా పార్ట్ ఎలా పూర్తవుతుందో చూడాలి. నా టైమ్, భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉంటాయో..
చిత్ర పరిశ్రమ ఏపీకి రావాలంటే అందుకు తగ్గట్టుగా ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్‌లో ఎలా ఉందో, ఇక్కడ కూడా అలాంటిది తీసుకురావాలి. ఎక్కడ బాగుంటుందో చూసుకుని ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. ముందు ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ బాగా డెవలప్ చేయాలి. దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి. అవకాశాలు విస్తృతం అవుతాయి’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు