Air India: గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా 787 బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం (Air India) కుప్పకూలిన దుర్ఘటనలో 260 మందికి పైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన తర్వాత విమానాలకు సంబంధించి ఎలాంటి ప్రతికూల వార్త అయినా చర్చనీయాంశమవుతోంది. అలాంటి గుబులు పుట్టించే ఘటన ఒకటి మంగళవారం జరిగింది. హాంగ్‌కాంగ్ నుంచి వచ్చి ఢిల్లీలో ల్యాండ్ అయిన ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బందికి ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది అందరినీ భద్రంగా కిందకు దించారు.
విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు కిందకు దిగుతున్న సమయంలో విమానానికి మంటలు అంటుకున్నాయని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, అయితే, విమానానికి కొంత నష్టం జరిగిందని చెప్పారు. ఈ ఘటన తర్వాత విమానాన్ని నిలిపివేసినట్టు అధికారి వివరించారు. ఏఐ 315 అనే ఫ్లైట్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. ల్యాండ్ అయ్యాక విమానం గేటు వరకు వెళ్లి ఆగిందని, విమానం ఆగిన తర్వాత కూడా విద్యుత్ సరఫరా అందించే ఏపీయూలో (auxiliary power unit) మంటలు చెలరేగాయని చెప్పారు. మంటలు చెలరేగిన తర్వాత ఏపీయూ విద్యుత్ ఆటోమేటిక్‌గా ఆగిపోయిందని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు.
Read Also- Ashley Madison: వివాహితుల రోత కథలు.. ఈ యాప్‌లో తెగ సైన్‌అప్‌లు
“విమానానికి కొంత నష్టం జరిగింది. అయినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు విమానాన్ని నిలిపివేశాం. రెగ్యులేటరీ అధికారులను సమాచారం అందించాం’’ అని ప్రకటనలో ఎయిరిండియా ప్రతినిధి పేర్కొన్నారు.
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
సోమవారం కూడా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఏఐ 2403 విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో, విమానం టేకాఫ్‌ను వెంటనే నిలిపివేశారు. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు.అవసరమైన భద్రతా తనిఖీల, రిపేర్ తర్వాత విమానం అదే రోజు సాయంత్రం కోల్‌కతా బయలుదేరి వెళ్లింది.
Read Also- Health: ఎందుకైనా మంచిది.. అరుదైన ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి!
అంతకుముందు సోమవారం తెల్లవారుజామున కూడా మరో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి వెళ్లి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఏఐ 2744 విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేను దాటి ముందుకెళ్లింది. ముంబైలో కురుస్తు్న్న భారీ వర్షాలు ఇందుకు కారణమయ్యాయి. విమానం టెర్మినల్ గేటు వరకు వెళ్లి ఆగింది. దీంతో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానంలోని ఒక ఇంజిన్‌కు స్వల్ప నష్టం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ధారించారు.