Counterfeit Liquor: నకిలీ మద్యం తయారీ అమ్మకాలపై ఆబ్కారి శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న గ్యాంగుల భరతం పట్టటానికి చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో నాన్ డ్యూటీ పెయిడ్, డిఫెన్స్ మద్యం అమ్మకాలను అరికట్టటానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఎనిమిది నెలలుగా
సూర్యాపేట(Suryapet) మేళ్ల చెరువు మండలం రామాపురం కేంద్రంగా సాగుతున్న కల్తీ మద్యం దందా గుట్టును ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం(Excise Department State Task Force Team) రట్టు చేసిన విషయం తెలిసిందే. టాస్క్ ఫోర్స్ టీం లీడర్ అంజిరెడ్డి(Anji Reddy) తెలిపిన ప్రకారం ఈ ముఠా ఎనిమిది నెలలుగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తోంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే గ్యాంగ్ సభ్యులు ఆంధ్రప్రదేశ్(AP)లో గత ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ మద్యం వ్యాపారం చెయ్యటం. లక్షల్లో డబ్బు అక్రమంగా సంపాదించటం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ముఠాలోని కొందరు పట్టుబడి జైళ్ల పాలయ్యారు. ఇలా కటకటాల పాలైన కొందరితో చేతులు కలిపిన కొందరు ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లోని రామాపురంలోని ఓ రైస్ మిల్లులో ఎంసీ విస్కీ పేర నకిలీ మద్యం తయారు చెయ్యటం మొదలు పెట్టారు.
Also Read: Vizag Scam: వైజాగ్‌లో అంబేద్కర్ పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన మ్యాక్స్!
38 కాటన్ల ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిళ్లు
శానిటైజర్ తయారీ కోసమంటూ ఉప్పల్ లోని ఓ సంస్థ నుంచి స్పిరిట్ కొని దీనిని తయారు చేస్తూ బెల్ట్ షాపుల్లో 80 రూపాయలకు ఒక బాటిల్ (90ఎంఎల్), క్వార్టర్ 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారం సేకరించిన అధికారులు రైస్ మిల్లుపై దాడి జరిపి 38 కాటన్ల ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిళ్లు, 11,800 ఖాళీ సీసాలు, 42.8 కిలోల బాటిళ్ల క్యాపులు, 7,814 లేబుళ్లు సీజ్ చేశారు. 200 లీటర్ల స్పిరిట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పల్నాడు జిల్లాకు చెందిన మహేష్ కుమార్, రైస్ మిల్లు ఓనర్ ప్రకాష్(Prakash) లను అరెస్ట్ చేశారు.
మిగితా నిందితులు శివ శంకర్, మల్లికార్జున్ రావు, శరణ్ జీత్ సింగ్, శ్రీనివాస్, అలియాస్ అబ్దుల్ కలాంలు ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉన్నారు. వీరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యాలని నిర్ణయించినట్టు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం తెలిపారు. గతంలో ఒరిస్సా రాష్ట్రం టోంగ్ జిల్లాలో కల్తీ మద్యం తయారీ యూనిట్‌ను అప్పడు రంగారెడ్డి(Ranga Reddy) డీసీగా ఉన్న డేవిడ్ రవికాంత్ తో పాటు పది మంది సభ్యుల బృందం పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: BRS KTR: నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆదేశాలు