Betting Apps Case: యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నుంచి నోటీసులు రావడంతో కూసాలు కదులుతున్నాయి. హీరో దగ్గుబాటి రానా జూలై 23న (బుధవారం), నటుడు ప్రకాష్ రాజ్ జూలై 30న, హీరో విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, నటి మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నది. అయితే రానా దగ్గుబాటి రేపు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను హాజరుకాలేనని సమయం కోరాడు. రేపు తనకు షూటింగ్ ఉన్నందున మరో రోజు విచారణకు హాజరవుతానని రానా ఈడీని అభ్యర్థించాడు. దీంతో రానా భయపడుతున్నాడనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా గట్టిగానే నడుస్తున్నది. అయితే హీరో అభ్యర్థనపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, రానా రిక్వెస్ట్‌ను అంగీకరించి అధికారులు మరో తేదీని ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే రేపు విచారణ అనగా ఇవాళ చెప్పడంతో ఈ పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? మరుసటి రోజే పిలవాలా? లేదంటే కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలా? అనేదానిపై అధికారులు ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. రానా తర్వాత ప్రకాష్ రాజ్ విచారణకు రావాల్సి ఉంది.. ఆయన కూడా హాజరవుతారా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటి వరకూ నలుగురికి మాత్రమే నోటీసులు జారీచేసిన ఈడీ అధికారులు దఫాలవారీగా మరికొందరిని విచారించే అవకాశం ఉంది.
Read Also- Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. రానా, మంచు లక్ష్మికి పిలుపు
ఏమిటీ కేసు..?
భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి ఈ యాప్‌లు నడుస్తున్నాయని, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఈడీ, సీబీఐ (ED, CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ముఖ్యంగా, క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతూ, అక్రమంగా సంపాదించిన డబ్బును మళ్లించడంపై ఈడీ దృష్టి పెట్టింది. బెట్టింగ్ యాప్స్ కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పంజాగుట్ట, మియాపూర్, విశాఖపట్నం, సూర్యాపేట, సైబరాబాద్‌లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ విచారణ జరుగుతోంది. ఈ కేసులో మొత్తం 29 మంది నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్లు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ మార్చి 19, 2025న దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. సెలబ్రిటీల ప్రచారాల వల్ల చాలా మంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ ‘జంగ్లీ రమ్మీ’.. విజయ్ దేవరకొండ ‘ఏ23’ ని ప్రమోట్ చేశారని శర్మ ఆరోపించారు.

Read Also- Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోకి మరో ముద్దుగుమ్మ ఎంట్రీ
ఇతర ప్రముఖుల సంగతేంటి?
విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్‌తో పాటు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల (Ananya Nagalla), ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi), యాంకర్ శ్యామల (Anchor Shyamala), యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ (Bhayya Sunny Yadav), లోకల్ బాయ్ నానిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ఆధారంగా, పీఎంఎల్ఏ కింద వీరిని ఈడీ విచారించనున్నది. ఇప్పుడు కొందరికే నోటీసులు ఇవ్వగా.. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చి ఈడీ విచారించనున్నది. ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అక్రమంగా డబ్బును తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాకుండా నోటీసుల అందుకున్న వారి బ్యాంకు లావాదేవీలు, వ్యాపార పెట్టుబడులు, ఈ బెట్టింగ్ యాప్‌లతో వారికి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో విచారించనున్నారు. వారి ఆర్థిక మూలాలపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, జూదాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇది ఈ కేసులో దర్యాప్తుకు మరింత బలం చేకూర్చింది. కాగా, ఈ వరుస విచారణలు టాలీవుడ్‌లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నది. ఈడీ విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
Read Also- Tollywood: పెళ్లి కాకుండానే తల్లైన రామ్ చరణ్ బ్యూటీ.. బేబీ బాయ్ కి వెల్కమ్ అంటూ పోస్ట్?