– కేబినెట్ సమావేశానికి బ్రేక్
– పర్మిషన్ ఇవ్వని ఈసీ
– భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి
– అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం
– ఇరిగేషన్ శాఖపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష
CM Revanth Reddy: రాష్ట్ర మంత్రివర్గం సమావేశానికి బ్రేక్ పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఏపీ పునర్విభజనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై చర్చ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రధాన కార్యదర్శితోపాటు అన్ని విభాగాల అధికారులు కేబినెట్ భేటీకి సిద్ధం అయ్యారు. శనివారం రాత్రి 7 గంటల వరకు సమావేశం కోసం వేచి చూశారు. కానీ, ఎన్నికల సంఘం నుంచి కేబినెట్ భేటీకి అనుమతి రాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని వాయిదా వేశారు. ఈసీ త్వరలో అనుమతి ఇస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం లోపు అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్టు సీఎం చెప్పారు.
రెండు మూడు రోజులుగా కేబినెట్ సమావేశం ఉంటుందని అందరూ ప్రిపేర్ అయ్యారు. అనుమతి ఇవ్వాలని సీఎం శాంతికుమారి ఈసీకి లేఖ రాశారు. కానీ, అందుకు అనుమతించలేదు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా ఎన్నికలు ముగిశాయి. చివరి ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. అనుమతి లభించకపోవడంతో కేబినెట్ సమావేశం జరగాల్సిన సమయానికి సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్‌డీఎస్ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిపారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్
కేబినెట్ సమావేశం జరిగి ఉంటే అందులో చాలా విషయాలపై సమీక్ష చేసేవారు. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై డిస్కషన్ జరిగేది. ఆస్తుల విభజన, హైదరాబాద్‌లోని ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, ఏపీ నుంచి రావాల్సిన బకాయిల వివాదాలపై చర్చ జరిగేది. అలాగే, రైతు రుణమాఫీ, నిధుల సమీకరణ, నూతన ఆదాయ మార్గాలపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునేది. అదే విధంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్ల తీరునూ సమీక్షించేది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంలో విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించేవారు మంత్రులు. కానీ, ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు.