Nitish Reddy: ఐదు మ్యాచ్‌ల ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీలో భారత్ జట్టుపై ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తవ్వగా, మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి నాలుగవ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు, నాలుగో మ్యాచ్‌నూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతోంది. దీంతో, నాలుగవ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద పట్టుకుంది.
ఆటగాళ్ల గాయాలు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పేసర్ అర్షదీప్ సింగ్ ఎడమ చేతికి గాయమవ్వగా.. తాజాగా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయంతో వైదొలగాడు. సిరీస్‌లోని మిగతా రెండు టెస్టులకూ ఈ యువ ప్లేయర్ దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఎడమ మోకాలికి గాయమవ్వడంతో ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండబోడని తెలిపింది. స్వదేశానికి తిరిగివస్తాడని, అతడు త్వరగా కోలుకోవాలని జట్టు అభిలాషిస్తోందని పేర్కొంది.
Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో దోషులంతా నిర్దోషులే.. హైకోర్టు సంచలన తీర్పు
పేసర్ అర్షదీప్ సింగ్ నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ చేతి వేలికి గాయమైందని, దీంతో నాలుగో టెస్టుకు ఈ పేసర్ అందుబాటులో ఉండడంలేదని పేర్కొంది. అర్షదీప్ గాయం ప్రభావవంతమైనదేనని, అతడి పురోగతిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. కీలకమైన నాలుగో టెస్టుకు ముందు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమవ్వడంతో బీసీసీఐ ఒక్క ఆటగాడిని మాత్రమే ప్రత్యమ్నాయ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ అంషుల్ కంబోజ్‌కు బీసీసీఐ మెన్స్ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. మాంచెస్టర్‌లో ఉన్న టీమిండియాతో అతడు ఇప్పటికే కలిశాడు.
బుమ్రాకు విశ్రాంతి ఇస్తే?
మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవ్వడానికి మరొక్క రోజు సమయం మాత్రమే ఉంది. టీమిండియా తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు. బీసీసీఐ సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, 5 టెస్టుల్లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడాల్సి ఉంది. ఇప్పటికే రెండు టెస్టులు ఆడగా, మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే ఆడతాడు. నాలుగవ టెస్టుకు జట్టులోకి తీసుకుంటారా? లేక, ఐదవ టెస్టుకు తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. బుమ్రా విశ్రాంతి తీసుకోవచ్చన్న ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, బుమ్రా ఆడకపోతే, అతడి స్థానంలో ఎవర్ని తుది జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా జట్టులోకి తీసుకోవచ్చంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే ఎవర్ని పక్కనపెడతారనేది చూడాలి.
Read Also- Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?
బీసీసీఐ అప్‌డేట్ తర్వాత భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అంశుల్ కంబోజ్.