Mumbai Blasts: దాదాపు 19 ఏళ్ల క్రితం అంటే, 2006లో ముంబై లోకల్ ట్రైన్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రయాణికుల రద్దీగా ఉంటే రైళ్లే లక్ష్యంగా కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే 7 బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘోర విషాదంలో 189 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 800 మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ కేసులో దోషులుగా తేలిన 12 మంది విషయంలో బాంబే హైకోర్టు సోమవారం అనూహ్యమైన సంచలన తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన 12 మంది నిర్దోషులని ప్రకటించింది. ఈ 12 మంది వ్యక్తులను దోషులుగా తేల్చుతూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. వారిలో ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవిత ఖైదు శిక్ష విధించింది.
నిందిత వ్యక్తులంతా దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమయ్యారని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చండక్‌లతో కూడిన బాంబే హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. కేవలం అభియోగాల ఆధారంగా నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టమేనని, అందుకే వారికి విధించిన శిక్షలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇతర కేసుల్లో వాంటెడ్‌గా లేకుంటే నిందితులందరినీ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ముంబై లోకల్ ట్రైన్ బాంబు పేలుళ్ల కేసులో ఆధారంగా చూపిన సాక్ష్యాలు సందేహాస్పదంగా ఉన్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. బాంబు పేలుళ్లు జరిగిన 100 రోజుల తర్వాత ఎవరైనా నిందితులను గుర్తుపట్టగలరా? అనే జడ్జిలు ప్రశ్నించారు.
కేసు తదుపరి విచారణలో గుర్తించిన బాంబులు, పిస్తోళ్లు, మ్యాపులు ఇవేమీ పేలుళ్లకు సంబంధం లేనివని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పైగా, రైళ్లలో పేలుళ్లకు ఏ రకమైన బాంబులను ఉపయోగించారో కూడా ప్రభుత్వం నిర్ధారించలేకపోయిందని వ్యాఖ్యానించారు.
Read Also- Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?
పేలుళ్లు ఎప్పుడు జరిగాయి?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై ట్రైన్ బాంబు పేలుళ్లు 2006 జూలై 11న సాయంత్రం 6.24 గంటల నుంచి 6.35 గంటల మధ్య సమయంలో జరిగాయి. కేవలం 11 నిమిషాల వ్యవధిలో వేర్వేరు లోకల్ ట్రైన్లలో ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చి గేట్ నుంచి వెళ్లే ట్రైన్లలో ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్లలో ప్రెషర్ కుకర్లలో బాంబులను అమర్చారు. జనాలు ఉద్యోగాలు, పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే రద్దీ సమయంలో పేలుళ్లు జరిపారు. మటుంగా రోడ్, మహిమ్ జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయందర్, బోరివలి స్టేషన్లకు సమీపంలో బాంబులను పేల్చివేశారు. తొలి పేలుడు 6.24 గంటల సమయంలో జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 2015లో 12 మంది దోషులుగా ప్రకటించింది. ఫైసల్ షేక్, ఆసిఫ్ ఖాన్, కమల్ అన్సారీ, ఎహ్తెషాం సిద్దికీ, నవీద్ ఖాన్‌లకు మరణశిక్ష విధిస్తూ ‘ది స్పెషల్ కోర్టు ఆఫ్ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్’ తీర్పునిచ్చింది. పేలుళ్ల కుట్రలో భాగస్వాములుగా ఉన్న మిగతా ఏడుగురు నిందితులైన మహ్మద్ సాజిద్ అన్సారీ, మొహమ్మద్ అలీ, డాక్టర్ తన్వీర్ అన్సారీ, మజీద్ షఫీ, ముజమ్మిల్ షేక్, సోహైల్ షేక్, జమీర్ షేక్‌లకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును తాజాగా బాంబే హైకోర్టు తోసిపుచ్చడంతో ఇన్నా్ళ్లు దోషులుగా ఉన్నవారంతా ఇప్పుడు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. వీరిపై ఇతర కేసులు ఏమీ లేకుంటే త్వరలోనే బయటకు వచ్చేస్తారు.
Read Also- Health News: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా?. కారణం ఇదే!