Forest Police Stations: త్వరలోనే రాష్ట్రంలో ఫారెస్ట్ పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి. అటవీ శాఖ అధికారులకు ఇవి ఎంతగానో దోహదపడనున్నాయి. గత బీఆర్ఎస్ (BRS) పాలనలోనే అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా ఆ ఫైల్‌కు మోక్షం లభించలేదు. ఈ మధ్య కాలంలో అటవీ శాఖ అధికారులపై దాడులు పెరిగి పోతుండడంతో ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల రక్షణ కోసం ఆయుధాలు ఇస్తామని ప్రకటించింది. దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Germany Accident: విచిత్రమైన ప్రమాదం.. పైకప్పు మీదకు దూసుకెళ్లిన కారు.. చివరికి!
అటవీ భూమి అన్యాక్రాంతం
రాష్ట్రవ్యాప్తంగా (Forest Department) అటవీ శాఖకు చెందిన భూమి అన్యాక్రాంతం అవుతున్నది. నానాటికి అటవీ విస్తీర్ణం తగ్గుతున్నది. దానిని పెంచేందుకు, భవిష్యత్ తరాలను కాపాడేందుకు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అటవీ విస్తీర్ణం పెరగడం లేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అటవీ భూములను రక్షించేందుకు అధికారులు కృషి చేస్తున్న తరుణంలో వారిపై గిరిజన, గిరిజనేతరుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు అధికారులపై దాడులు జరుగుతున్నాయి.
దీంతో వారు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమకు రక్షణ కల్పించాలని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నారు. అయితే, ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ల (Forest Police Stations) అంశాన్ని పరిశీలన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్ల మాదిరిగా (Forest Department) అటవీశాఖ పరిధిలో ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో సైతం చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే స్టేషన్ల అంశం కొలిక్కి రాబోతుందని సమాచారం.
బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం
భద్రాద్రి జిల్లా (Bhadradri District) ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు 2022లో దారుణ హత్యకు గురయ్యారు. దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో 300 ఫారెస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ ప్రతిపాదనలు పంపింది. తొలి విడుతలో 30, ఒక్కో స్టేషన్‌కు 18 మంది సిబ్బందిని నియమించాలని కోరింది. అటవీ శాఖలో చురుగ్గా విధులు నిర్వర్తిస్తున్న యువతకు ఈ స్టేషన్లలో అవకాశం కల్పించాలని భావించింది. కానీ, గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
త్వరలోనే నిర్ణయం
ఈ మధ్యకాలంలో పోడు భూముల వ్యవహారంలో అటవీ అధికారులకు, గిరిజన, గిరిజనేతరుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. (Kothagudem District) కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలో పలుమార్లు అధికారులపై దాడులు జరిగాయి. ఇచ్చోడ మండలంలో, కన్నాయిగూడెంలో, తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు వెళ్లిన సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్‌మెంట్‌లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అదికారులపై పోడు రైతులు, ముల్తానీలు దాడి చేశారు.
దీంతో మళ్లీ ఫారెస్ట్ స్టేషన్ల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అటవీ అధికారులు, సిబ్బంది రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అయితే, ఆయుధాల అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం మళ్లీ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అటవీ అధికారులు తమ రక్షణకు ఆయుధాలు కావాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వం మాత్రం సమగ్రంగా ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..