Jogulamba Gadwal district: ప్రతి సంవత్సరం అధికారులు పల్లెలో ముక్కుపిండి ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు కాని త్రాగు నీటి సమస్య మాత్రం తీర్చలేకపోతున్నారని అధికారుల మీద జోగులాంబ (Gadwal District) గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలోని వెంకటాపురం గ్రామ ప్రజలు దుమ్మెతిపోస్తున్నారు. గ్రామంలో పంచాయతీ బోరు మోటర్ కాలిపోవడం, మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో మంచినీటి కోసం మహిళలు. గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో ఉన్న బోరు బావులే దిక్కుగా మారింది.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
గత రెండు రోజులుగా మిషన్ భగరీథ నీళ్లు సరఫరా నిలిపి వేస్తున్నట్లు అప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా గ్రామంలో ఉన్న పంచాయతీ బోరు మోటార్ ద్వారా త్రాగు అందించాలి. కాని నాలుగు రోజుల క్రితమే బోరు మోటార్ కూడా కాలిపోవడంతో పట్టించుకునేవారు కరువైపోయారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బోరు మోటార్ కాలిపోవడంతో మరమ్మతులు చేయడానికి నిధులు లేవని గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పలు కాలనీలకు అందని మిషన్ భగీరథ నీళ్లు
గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామీ దేవాలయం సమీపంలోని పలు కాలనీలు నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు (Mission Bhagiratha Water) రావడం లేదు. దీంతో గ్రామస్తులు మంచినీళ్లు రావడం లేదని సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు (Mission Bhagiratha Water) రావడంలేదని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపించారు. మంచి నీళ్లు రాకపోవడంతో సమీపంలోని బోరు బావుల వద్ద నుంచి తెచ్చుకునే దుస్థితి నెలకొందని గ్రామస్తులు పేర్కొన్నారు. విధి లేక ప్రజలే స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో మోటర్ రిపేర్ చేయించుకొని నీటి సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమయ్యారు. ధరూర్ మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ 1200 ఎంఎం డ్యామేజ్ తో నేడు గద్వాలకు నీటి సరఫరా కావడం లేదు.అదేవిధంగా చింతలకుంట గ్రామం,మానవపాడు మండలంలోని పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.
Also Read: Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!