Jupally Krishna Rao: నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన, ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తూ జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో పలు వేలకోట్ల అభివృద్ధి పనులకు బీజం వేసిన సీఎం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
జిల్లా అభివృద్ధిపై సీఎం ముద్ర
సీఎంగా ఎన్నికయ్యాక గతేడాది జూన్ లో కల్వకుర్తిలో పర్యటించిన సందర్భంగా 309కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు. ఈ నిధులతో కల్వకుర్తిలో ఆస్పత్రి, నాలుగు లేన్ల రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పీఆర్ రోడ్లకు 78కోట్లు, గెస్ట్ హౌజ్, హైలెవల్ కెనాల్ బ్రిడ్జ్, తదితర పనులకు నిధుల మంజూరు ఇవ్వగా పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక అచ్చంపేట నియోజకవర్గంలో ఈ ఏడాది మేలో పర్యటించారు. కాగా రాష్ట్రంలో 1200 కోట్లతో చెంచు,గిరిజనులను వ్యవసాయంలో ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఇందిర సౌరగిరి జలవిద్యుత్ పథకాన్ని ప్రారంభించడంతో పాటు ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం నల్లమల డిక్లరేషన్(Nallamala Declaration) ఇక్కడే ప్రకటించడం విశేషం. అదే కాకుండా అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సౌర విద్యుత్ అందించేలా అధికారులకు ఆదేశాలిచ్చారు.
వందల కోట్లతో అభివృద్ధి
దీనివల్ల చెంచు గిరిజనులతో పాటుగా వేలాది మంది రైతులకూ వ్యవసాయానికి శాశ్వత విద్యుత్ సమస్యను తీర్చే బృహత్తర కార్యక్రమానికి బాటలు వేశారు. అలాగే వంగూరు, పోల్కంపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా పబ్లిక్ స్కూళ్లను తీసుకొచ్చారు. సొంతూరు కొండారెడ్డి పల్లిలో వందల కోట్లతో అభివృద్ధి చేపడుతున్నారు. అలాగే నాలుగు నియోజకవర్గాల్లో 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు(Young India Integrated Schools), 285 కోట్లతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 550 పడకల ఆస్పత్రికి, బిజినేపల్లి మండలంలో మార్కండేయ రిజర్వాయర్ కి 70కోట్ల నిధులు మంజూరు చేశారు. నల్లమలను టూరిజం హాట్ స్పాట్ గా అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర మంత్రుల బృందం నాలుగు రోజులు పర్యటించింది. ఇందులో భాగంగా మన్ననూర్, అమ్రాబాద్ తో పాటుగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నల్లమల, కృష్ణానది తీరంలో పర్యాటక రంగ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఇటీవలే 60కోట్లు మంజూరు అయ్యాయి.
Also Read: Ramchander Rao: టీబీజేపీలో చక్రం తిప్పేదెవరు.. తెర వెనుక కీలక నేతలు
డిసెంబర్ నాటికి అధికారుల లక్ష్యం
ఇవేగాక ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లక్షలాది మంది లబ్దిపొందుతున్నారు. ఇక నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కోరిన వెంటనే స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు, సీసీ, బీటీ రోడ్లకు, అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ సొంత జిల్లా కందనూలుపై తన ప్రేమను చాటుకుంటున్నారు. ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాద సంఘటనలో టన్నెల్ పరిశీలనకు నల్లమలకు వచ్చారు. ఈ సంఘటనతో పనుల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొనగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతనెలలో నిపుణులు టన్నెల్ పరిశీలించారు.
ఇవేగాక గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి ఈ డిసెంబర్ నాటికి అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. హైదరాబాదులో ఈ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా జిల్లాలో ఈ విధంగా పర్యటించకపోవడం గమనార్హం. సొంత ప్రాంతం కావడంతో పాలమూరు అందులోనూ కందనూలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లు పూర్తి కాకుండానే నియోజకవర్గాలను చుట్టేయడం, అభివృద్ధి కనిపించేలా చేయడం ప్రజలను ఆకట్టుకుంటుంది.
ఈ అభివృద్ధితో ప్రజల్లో సీఎంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం రెట్టింపవుతోంది.
కొల్లాపూర్ అభివృద్ధిపై జూపల్లి మార్క్!
ఈ నేపథ్యంలో కొల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. దీంతో జిల్లా ప్రజల్లో ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల్లో అభివృద్ధిపై మరింత ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. జూపల్లి తీసుకుంటున్న చర్యలతో కొల్లాపూర్(Kollapur) ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సీనియర్ మంత్రిగా, కొల్లాపూర్ ప్రజల ఆప్తుడిలా నియోజకవర్గంలో అభివృద్ధికి జూపల్లి అంకితం అవుతున్నారు. సంబంధిత శాఖ మంత్రిగా నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు జూపల్లి హయంలో రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి.
పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తి పెండింగ్ పనులు అలాగే భూసేకరణ పనులను ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా మంత్రి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న నియోజకవర్గాన్ని మర్చిపోకుండా ప్రజలతో మమేకం అవుతూనే అభివృద్ధిని జూపల్లి ముందుకు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జటప్రోలు వద్ద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా 150కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి శంకుస్థాపన నిర్మిస్తున్నారు. అలాగే మహిళా సంఘాలకు రుణాల మంజూరును చేయించారన్నారు. ఇలా సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.
Also Read: BC Reservation Bill: గవర్నర్ బీసీ రిజర్వేషన్లపై గెజిట్ జారీ చేయాలి.. కవిత డిమాండ్