Panchayat Elections: పల్లెల్లో ఆశావాహుల కోలాహలం మొదలైంది.స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో ఓట్ల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు రిజర్వేషన్లపై బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో సమీకరణాలపై దృష్టిసారించారు. అంతేకాదు టికెట్ల కోసం పార్టీ కీలక నేతలు, గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు స్టార్ట్ చేశారు. అంతేకాదు తమకు ఈ సారి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందేననే డిమాండ్లను సైతం నేతల ముందుపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ సైతం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం అయింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. రెండు విడుతల్లో నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్ర జనాభాలో 56శాతం ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై బీసీ కులాలకు చెందిన ఆశావాహులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం బీసీలకు సముచి త స్థానాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అ సెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా బీసీ లకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ బీసీ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలు సత్తా చాటారు. గత ఎన్నికల్లో బీసీలకు 22 శాతమే రిజర్వేషన్ కల్పించగా అప్పటి ఎన్నికల్లో బీసీ కులస్తులు తమ ప్రభావాన్ని చాటారు. ఈ సారి ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌లను ఆర్డినెన్స్ మార్గంలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీల ప్రాతినిథ్యం మరింతగా పెరుగుతుందని పలువురు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Anupama Parameswaran: ‘పరదా’ సినిమా చిన్నదైనా.. చెప్పాలనుకున్న కంటెంట్ చాలా పెద్దది
అయితే నాకు.. లేకుంటే నా భార్యకు!
గ్రామాల్లో పార్టీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎక్కువ మంది పోటీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. గ్రామశాఖఅధ్యక్షుల అధ్యక్షతన సమావేశమవుతూ ఎవరికి టికెట్లు ఇస్తే విజయం సాధిస్తారు. పోటీకి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఏళ్లతరబడి పార్టీలో పనిచేస్తున్నవారు టికెట్లను ఆశిస్తున్నారు. మహిళకు వస్తే తన భార్యకు ఇవ్వాలనే డిమాండ్‌ను పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇదే విషయాన్ని అధికారపార్టీ ఎమ్మెల్యేలకు సైతం తెలుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రధానప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు సైతం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలవద్దకు వెళ్లి టికెట్లు అడుగుతున్నారు. రాష్ట్రంలోని అన్నిపార్టీలు సైతం ఇప్పటికే బలం ఉన్నదగ్గర పోటీచేస్తామని ప్రకటనలు చేశాయి. టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం ఇప్పటికే గ్రామాల్లో వార్డుల వారీగా కలియదిరుగుతున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడంతోపాటు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని పేర్కొంది.
సెప్టెంబర్ 30లోగా..
రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే పంచాయతీరాజ్‌శాఖ రిజర్వేషన్లను ఖారారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండో విడుతలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలకు కంప్లీట్ చేయాలని సూచించడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి కాగానే గరిష్టంగా 30 రోజుల్లో పరిషత్, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ కరసత్తు చేస్తోంది. అయితే ఈనెల చివరి వారంలో లేక, ఆగస్టు మొదటివారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Read Also- Poola Chokka: పోలీస్ స్టేషన్‌కు పూలచొక్కా నవీన్.. ఎందుకంటే?