YSRCP: మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి (Busine Virupakshi) రోడ్డెక్కారు. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల పరిధిలోని 33 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పరి చౌరస్తాలో వైసీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆస్పరి మండలంలో ఉండే 33 గ్రామాలకు తీవ్రంగా తాగునీటి సమస్య ఉందన్నారు. ‘ నేను ఎలక్షన్ ప్రచారంలో ప్రతి గ్రామానికి వెళ్లినప్పుడు అక్క చెల్లెమ్మలు.. సార్ మాకు తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. వేసవి కాలం వస్తే తాగునీరు సమస్య అధికంగా ఉంటుంది. జోహలాపురం గ్రామంలో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని చాలాసార్లు అధికారులు కోరారు. కూటమి ప్రభుత్వం ఏడాదిగా మంచినీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ప్రజల సమస్యల గురించి గాలికి వదిలేశారు. నేను జిల్లా పరిషత్ మీటింగ్‌తో పాటు అన్ని మీటింగ్‌లలో ఆస్పరి మండలంలో అన్ని గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలని అధికారులను అడిగాను. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడిని కూడా చాలాసార్లు వినతిపత్రం ఇచ్చాను. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పరి మండలంలో నీటి సమస్య తీర్చకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని విరుపాక్షి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియా ముందుకు ఎందుకొచ్చారో చూద్దాం..
Read Also- Viral News: ఒకప్పుడు సచిన్‌కు ప్రత్యర్థి.. నేడు ఆయన బతుకుదెరువు ఏంటో తెలుసా?
కళ్యాణదుర్గం కేంద్రంగా లిక్కర్ మాఫియా!
రాష్ట్రంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మద్యం మాఫియాకు అడ్డగా మారిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తలారి.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ మద్యం ముఠా పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే హస్తగతం చేసుకుని అధిక రేట్లతో విక్రయించడంతో పాటు అనుబంధంగా బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 10 వైన్ షాపులంటే ఒకటి రీటెండరింగ్‌కి వచ్చిందన్నారు. 9 షాపులుంటే వాటిలో 8 వైన్ షాపులు కళ్యాణి వైన్స్ పేరుతో నడుస్తున్నాయని.. పారదర్శకంగా టెండర్ ద్వారా కేటాయించినప్పుడు అన్నీ ఒక్కరికే ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు.
ఇంత దారుణమా?
‘ వైన్ షాపులను కబ్జా చేసి అన్నింటికి కళ్యాణి వైన్స్ అని పేరు పెడుతుంటే ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు? దినేశ్ అనే వ్యక్తి హోటల్ నడుపుకునేవాడు. ఆయనకు ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో కళ్యాణదుర్గంలో వైన్ షాపు తగిలింది. దాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మనుషులు బెదిరించి లాగేసుకున్నారు. దీంతో దినేశ్ సహా ఆయన బంధువులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనకి దిగిన వీడియోలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో దినేశ్‌కి హోటల్ కూడా లేకుండా చేసి ఎమ్మెల్యే ఆయన్ను రోడ్డున పడేశాడు. దినేశ్ తరపున వైన్ షాపు కోసం గట్టిగా పోరాడిన ప్రజా సంఘాల్లో పనిచేసే ఆయన స్నేహితుడు కూడా తర్వాత కాలంలో ఎమ్మెల్యే లాంటి వ్యక్తి దేశంలోనే లేడంటూ ఆయన్ను పొగుడుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఇదంతా ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన అనుచరులు చేస్తున్న బెదిరింపులకు ఉదాహరణలు. ఒక పక్క సీఎం చంద్రబాబు బెల్ట్ షాపు పెడితే బెల్టు తీస్తానని హెచ్చరిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా కొత్తవి వెలుస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే దాదాపు 300లకు పైనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి’ అని రంగయ్య లెక్కలతో సహా వివరించారు.
Read Also- Chandrababu: సీమకు నీరిచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మరిచిపోలేను!
బెల్ట్ షాపు రూ.12 లక్షలు..
‘ ఒక్కో బెల్ట్ షాప్‌కు వేలం వేసి రూ.4 లక్షల నుంచి రూ.12 లక్షలకు కేటాయిస్తున్నారు. ఇంకా డిమాండ్ ఎక్కువైతే ఆ గ్రామంలో రెండో బెల్ట్ షాపు ఇచ్చేస్తున్నారు. ఒక్కో బాటిల్ మీద అదనంగా రూ.10ల నుంచి 20లు వసూలు చేస్తున్నారు. నెలకి కోట్లలో సంపాదిస్తున్నారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు? వైసీపీ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు లేకుండా చూసుకుంటే కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. గోవా నుంచి మద్యం తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ లేబుల్ వేసుకుని అమ్ముకుంటున్నారు. అక్రమ మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు. యువత రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఎమ్మెల్యే అరాచకాలపై ప్రశ్నిస్తే మా ఇంటి మీదకు దాడులకు ఉసిగొల్పుతున్నారు. బెదిరించి భయాందోళనలకు గురిచేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో అని మేం ప్రజల్లోకి వెళ్తుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొద్దని మా ఎమ్మెల్యే ప్రజల్ని వేడుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డబ్బులు దోచుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మాజీ ఎంపీ రంగయ్య తీవ్రంగా మండిపడ్డారు.
Read Also- Bakasura Restaurant: ‘బకాసుర రెస్టారెంట్’.. విడుదల తేదీ ఎప్పుడంటే?