Ramchander Rao: తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన మొదలవ్వనుంది. ప్రస్తుతమున్న కమిటీల్లో మార్పు జరగనుండటంతో కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా ఎవరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే కమిటీల నియామకంలో వారి మార్క్ చూపించుకునే ప్రయత్నం చేయడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాషాయ దళపతిగా రాంచందర్ రావు(Ramchander Rao) ఎన్నికయ్యారు. అయితే ఈ కమిటీలో నియామకంలో తన మార్క్ చూపించుకుంటారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆయన ఎన్నికలో కొందరు నేతలు కీలకంగా వ్యవహరించారనే చర్చ మొదటి నుంచే ఉంది. దీంతో ఈ కమిటీల నియామకంలో చక్రం తిప్పబోయేదెరనేది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ డెసిషన్ స్టేట్ చీఫ్ ది ఉండనుందా? లేక మరో కీలక నేతలు ఇందులో ఇన్ వాల్వ్ అవుతారా? అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు
తెలంగాణ కమల దళపతిగా పాత నేత అయిన రాంచందర్ రావుకే హైకమాండ్ పగ్గాలు అప్పగించింది. దీంతో ఆయన పార్టీ ప్రక్షాళన దిశగా ఆపరేషన్ మొదలుపెట్టారు. రాష్ట్ర కమిటీలో ఎవరికి ప్రయార్టీ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కాగా ఈ అంశంపై రాంచందర్ రావుకు ప్రత్యర్థి పార్టీల నుంచి కంటే.. సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో పలువురు నేతలు తమ అనుచరులకే కొత్త కమిటీలో ప్రియారిటీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందని టాక్. దీంతో ఈ కమిటీలో ఎవరికి చోటు కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అందరినీ బ్యాలెన్స్ చేయడం పార్టీ స్టేట్ చీఫ్ఎదుట ఉన్న అతిపెద్ద సవాల్ అని తెలుస్తోంది. కమలం పార్టీ అధ్యక్షుడిగా కొత్త నేతలకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరగడంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjey), రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(Laxman) అలర్ట్ అయి పాత నేతకు దక్కేలా కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరిగింది. కాబట్టి కమిటీ నియామకంలో వారి ఇన్వాల్వ్ మెంట్ ఏమైనా ఉండబోతోందా? అనే చర్చ జరుగుతోంది.
Also Read: BC Reservation Bill: స్థానిక సమరానికి సర్కార్ ప్రిపరేషన్.. ఎన్నికల జాబితా కోరిన ఈసీ
పార్టీలో బండి సంజయ్ దే హవా
ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రాంచందర్ రావు నామినేషన్ నుంచి మొదలుకుని అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన సభలో బండి సంజయ్ అన్నీ తానై నడిపించారు. ఈ సంకేతాలతో పార్టీలో బండి సంజయ్ దే హవా కొనసాగుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే పార్టీ వ్యవహారాల్లో కిషన్ రెడ్డి(Kishan Reddy) రూటే సపరేట్. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పార్టీపై పట్టును నిరూపించుకోవడం ఆయన ప్రత్యేకత. అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ రాష్ట్ర పార్టీలో తన మాట నెగ్గేలా చూసుకుంటారని పార్టీలో టాక్. రాంచందర్ రావు ఎన్నికలో వ్యూహత్మకంగా కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పార్టీ కార్యకర్తల్లో చర్చసాగుతోంది.
ఇక రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం తెలంగాణ బీజేపీ(BJP)పై తన మార్క్ ఉండేలా చూసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ కొత్త రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్న వారు తమ లీడర్ తో చెప్పించుకుంటే సరిపోతుందనే లెక్కల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రాంచందర్ రావు ఈ అంశంపై ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. క్రిమినల్ లాయర్ గా పేరొందిన ఆయన.. పొలిటికల్ గా మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవల డమ్మీ అని ప్రచారం చేసిన వాళ్లకు డాడీ అవుతానని ఘాటుగా స్పందించిన ఆయన కొత్త కమిటీల వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 ట్రెయిన్‌లు