Employee Health issues: సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులంటే (Software Employees) అందరికీ వారి లగ్జరీ లైఫ్, లక్షల్లో జీతాలే గుర్తుకు వస్తాయి. అయితే వారు ఉద్యోగ జీవితంలో పడే కష్టాలు.. ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడిని ఎవరూ పట్టించుకోరు. ఉద్యోగ జీవితంలో వారు పడుతున్న బాధపడుతున్న బాధలు.. ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా బయటకు రావడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. తను పడుతున్న ఆవస్థలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.
అసలేం జరిగిందంటే?
సోషల్ మీడియా వేదిక రెడ్డిట్ (Reddit) లో ఓ సీనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ (Sr Software Developer) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రతీ వారం తాను అదనంగా 20 గంటలు పనిచేయాల్సి వస్తోందని రాసుకొచ్చారు. టెక్ లీడ్ రోల్ గా ఎదగాలంటే స్వీయ అభ్యాస కోర్సులను పూర్తి చేయాలని తమ కంపెనీ సూత్ర ప్రాయంగా తెలియజేసినట్లు చెప్పారు. ఫలితంగా ప్రతీవారంలో పని తర్వాత 3 గంటలు అదనంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. దీనికి ఎలాంటి జీతం కూడా చెల్లింపు ఉండదని అన్నారు. ఇక్కడ (కంపెనీ) ఎదగాలంటే అదనపు గంటలు పనిచేయాల్సిందేనని రెడ్డిట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
చెప్పినా.. ఎవరు నమ్మరు
తీవ్రమైన పనిభారం.. తన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించడం ప్రారంభమైందని సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి తెలియజేశాడు. ప్రస్తుతం తనతోపాటు కొందరు తోటి ఉద్యోగులు గుండె సమస్యలకు సంబంధించిన లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనిపై వైద్యుడ్ని సంప్రదించగా అధిక ఒత్తిడితో పనిచేయడం తగ్గించాలని సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘అయితే ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లే ధైర్యం కూడా తాము చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. ‘ఈ విషయం చెప్పినా వారు నమ్మరని నాకు తెలుసు. వేరే మార్గం లేదని ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. నా ఆరోగ్యం మరింతగా దిగజారడం మెుదలైంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో మరొక ఆఫర్ లెటర్ లేకుండా కంపెనీని విడిచిపెట్టే ధైర్యం చేయలేకపోతున్నట్లు రెడ్డిట్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Fauja Singh Case: కెనడా నుంచి వచ్చి.. ఫౌజా సింగ్ ప్రాణం తీశాడు.. ఎన్ఆర్ఐ అరెస్ట్!
నెటిజన్లు ఏమంటున్నారంటే?
మరోవైపు సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెట్టిన పోస్టుకు నెటిజన్లు మద్దతు తెలియజేస్తున్నారు. పని సమయంలోనే స్వీయ అభ్యాస సమయాన్ని కేటాయించమని మీ మేనేజర్ ను అడగాలని సూచిస్తున్నారు. అయితే ఇది తమ ఆఫీసులోనూ తప్పనిసరి.. దాటవేయలేమని’ మరొక రెడ్డిట్ యూజర్ అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిదికాదని మరొక యూజర్ పేర్కొన్నారు. ‘ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎప్పుడూ విస్మరించవద్దు’ అంటూ హెచ్చరించారు. ఆరోగ్యాన్ని త్యాగం చేయడం కన్నా.. పని వదిలేయడం ఉత్తమమని మరొకరు సలహా ఇచ్చారు.