Nimisha Priya: యెమెన్‌లో ఆ దేశ పౌరుడి హత్య కేసులో మరణశిక్ష ఖరారైన భారతీయ నర్సు నిమిషా ప్రియాకు శిక్ష అమలు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉరి శిక్ష అమలు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. వాస్తవానికి నిమిషాకు బుధవారం (జులై 16) శిక్ష అమలు చేయాల్సి ఉండగా, భారత ప్రభుత్వం నిర్విరామ కృషితో వాయిదా సాధ్యమైంది. నిమిషాను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న భారత ప్రభుత్వం శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయించగలిగింది. అయితే, శిక్ష వాయిదా పడినంత మాత్రాన నిమిషా ప్రియాకు విముక్తి లభించదు. ఆమెను భారత్‌కు కూడా పంపించరు.
కొనసాగుతున్న చర్చలు
కేరళకు చెందిన నిమిషా ప్రియా యెమెన్ పౌరుడిని హత్య చేయడంతో ఆమెకు మరణదండన విధిస్తూ స్థానిక కోర్టులు నిర్ణయించాయి. ప్రస్తుతం ఆమె యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న రాజధాని ‘సనా’లో జైలులో ఉంది. హౌతీలతో భారత్‌కు నేరుగా దౌత్య సంబంధాలు లేవు. అయినప్పటికీ సాధ్యమైన అన్ని మార్గాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోంది. నిమిషా ప్రియను రక్షించేందుకు యెమెన్‌లో తీవ్ర స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. బ్లడ్ మనీ (నష్టపరిహారం) ఇంకొన్ని రోజుల సమయం ఇచ్చి, బాధితుడి కుటుంబంతో సంప్రదింపులు జరిపి పరిష్కారం సాధించాలని కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తోంది. చాలా సున్నితమైన పరిస్థితుల మధ్య జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో భారత అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఫలితంగానే మరణశిక్ష అమలు వాయిదా సాధ్యమైంది.
Read Also- Malnadu Restaurant Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీస్ అధికారుల సుపుత్రులు
అసలు ఏంటీ కేసు?
2008లో నిమిషా ప్రియా నర్సు ఉద్యోగం కోసం యెమెన్ వెళ్లింది. అక్కడ పలు ఆసుపత్రుల్లో పని చేసింది. ఆ తర్వాత, సొంతంగా క్లినిక్ ప్రారంభించింది. స్థానిక చట్టాల ప్రకారం, యెమెన్ పౌరుడు ఒకరు భాగస్వామిగా ఉంటే మాత్రమే అక్కడ క్లినిక్ నిర్వహణ సాధ్యమవుతుంది. అందుకే, తలాల్ అబ్దో మెహ్దీ (37) అనే వ్యక్తిని భాగస్వామిగా కుదుర్చుకుంది. అయితే, అతను నిమిషా ప్రియాను వేధింపులకు గురిచేశాడు. డబ్బులు తీసుకోవడమే కాదు, నిమిషా పాస్‌పోర్టును కూడా బలవంతంగా లాక్కొని తన వద్ద పెట్టుకున్నాడు. పాస్‌పోర్టు ఎలాగైన వెనక్కి తీసుకోవాలని భావించిన నిమిషా 2017లో తలాల్ అబ్దో మెహ్దీకి ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్నాక పాస్‌పోర్టు తీసుకెళ్లాలని భావించింది. కానీ, దురదృష్టవశాత్తూ మత్తు డోస్ ఎక్కువై అతడు చనిపోయాడు. దీంతో, యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ నిమిషా ప్రియా అరెస్ట్ అయింది. స్థానిక చట్టాల ప్రకారం నిమిషాకు మరణశిక్ష పడింది. యెమెన్ సుప్రీంకోర్టు కూడా మరణ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత, యెమెన్ అధ్యక్షుడు కూడా మరణశిక్షకు ఆమోదముద్ర వేశారు. మరణశిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. జూలై 16న (బుధవారం) ఆమెను ఉరి తీసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. చివరి ప్రయత్నంగా బాధిత కుటుంబం ‘బ్లడ్ మనీ’ స్వీకరించడానికి అంగీకరిస్తే మాత్రమే నిమిషా ప్రియా ప్రాణాలు బయటపడుతుంది. లేదంటే, ఉరిశిక్షను ఎదుర్కోవాల్సిందే.