Viral News: బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రంగా (Viral News) మారిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ సమస్యలను వేగలేక పోతున్నామని స్థానికవాసులు, ఐటీ ఉద్యోగులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ వాపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతినిత్యం ఎందరో నానా అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) అనే కంపెనీ సహ-వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
గత శనివారం రాత్రి ఆయన బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్‌లో (ORR) కేవలం 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏకంగా 2 గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో, ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకే జంక్షన్ వద్ద ఏకంగా 100 నిమిషాల పాటు నిలిచిపోవాల్సి వచ్చిందని, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్, ట్రాఫిక్ పోలీస్ కూడా కనిపించలేదని ప్రశాంత్ పిట్టి విస్మయం వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న ఆయన, బెంగళూరు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గూగుల్ మ్యాప్స్ డేటా ఆధారంగా నగరంలోని అత్యంత తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఉండే ప్రాంతాలను గుర్తించి వాటికి పరిష్కరించేందుకు సాయం అందిస్తానని తెలిపారు. తనవంతుగా రూ.1 కోటి విరాళం కూడా ఆయన ప్రకటించారు.
Read Also- Air India: విమాన ప్రమాద ప్రాథమిక రిపోర్టుపై ఎయిరిండియా కీలక ప్రకటన
ఇక మీమ్స్ వద్దు
బెంగళూరు ట్రాఫిక్ సమస్యల మీద ఇకపై తాను మీమ్స్ కోరుకోవడంలేదని, పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు ప్రశాంత్ పిట్టి పిలుపునిచ్చారు. గూగుల్ మ్యాప్స్ ఇటీవల విడుదల చేసిన ‘రోడ్ మేనేజ్‌మెంట్ ఇన్‌సైట్’ అనే టూల్‌ను ప్రస్తావించిన ఆయన, దీని ద్వారా నగరమంతటికి సంబంధించిన ట్రాఫిక్ డేటా ‘బిగ్‌క్వెరీ’ (BigQuery) ఫార్మాట్‌లో లభిస్తుందని వివరించారు. శాటిలైట్ ఫొటోలు, ఏఐ ఆధారంగా నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడు, ఎక్కడ ఎక్కువగా ఉంటాయో గుర్తించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also- Mohammed Siraj: సిరాజ్‌కు ఐసీసీ బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు
వేతనం భరిస్తా
బెంగళూరు ట్రాఫిక్ తీవ్రంగా ఉండే ప్రాంతాల గుర్తింపు ప్రాజెక్టులో ఒకరు లేదా ఇద్దరు ఏఐ ఇంజినీర్లకు వేతనం, గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ఛార్జీలు, శాటిలైట్ ఫొటోల లైసెన్స్, జీపీయూ వంటి మొదలైన ఖర్చులు తానే భరిస్తానని ప్రశాంత్ పిట్టి పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ (BTP), లేదా నగర పాలక సంస్థ బీబీఎంపీ అధికారులు తమ ట్రాఫిక్ డేటా లేదా ఏపీఐలను షేర్ చేయాలని పేర్కొన్నారు. డేటా ఆధారంగా అందే సూచనలపై పనిచేయడానికి ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలని వివరించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరించాలని కోరిన ప్రశాంత్ పిట్టి, ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయాలని కోరారు. ‘‘ట్రాఫిక్ అధికారులను ట్యాగ్ చేయండి. ఏఐ నిపుణులను ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ప్రోత్సహించండి. ఈ విషయం ప్రభుత్వాధికారుల వరకు చేరేలా షేర్ చేయండి’’ అంటూ ఎక్స్ పోస్టులో ఆయన పిలుపునిచ్చారు. ‘బెంగళూరు భారత టెక్ భవిష్యత్. దానిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకు మరింత మెరుగైన ట్రాఫిక్ వాతావరణం కావాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశాంత్ పిట్టి పోస్టులపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. చాలా మంది సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏఐ రంగానికి చెందిన అనేక మంది తమ సమయం, నైపుణ్యాలను అందివ్వడానికి సిద్ధమయ్యారు.