Air India: ఎయిరిండియా (Air India) బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఏఏఐబీ (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిపోర్టుపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ కీలక ప్రకటన చేశారు. ప్రమాదానికి గురైన విమానం లేదా ఇంజిన్లలో ఎలాంటి యాంత్రిక లోపం, నిర్వహణ (మెయింటెనెన్స్) సమస్యలు లేవనే విషయం ప్రాథమిక నివేదిక ద్వారా వెల్లడైందని వివరించారు. గత కొన్ని వారాలుగా మీడియాలో వస్తున్న వదంతులు, ఊహాగానాలు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎయిరిండియా ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఇలాంటి విశ్లేషణలతో టైమ్ వేస్ట్
ఎయిరిండియా విమాన ప్రమాదంపై మీడియాలో వెలువడిన ఊహాగానాలు, కథనాలపై క్యాంప్‌బెల్ విల్సన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి విశ్లేషించడంలో సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచన చేశారు. విమానంలో ఎలాంటి యాంత్రిక లోపం లేదని, నిర్వహణలో తప్పనిసరి అయిన అన్ని పనులను పూర్తి చేశామన్నారు. ఇంధనం నాణ్యత కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, టేకాఫ్ సమయంలో కూడా ఎలాంటి అసాధారణ పరిస్థితిని గుర్తించలేదని క్యాంప్‌బెల్ స్పష్టం చేశారు. పైలట్లు ఇద్దరూ ముందుగానే అల్కహాల్ టెస్ట్‌లో (బ్రీద్ అనలైజర్) పాసయ్యారని గుర్తుచేశారు. వైద్యపరంగా కూడా ఇద్దరిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని వివరించారు.
Read also- Mohammed Siraj: సిరాజ్‌కు ఐసీసీ బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు
ఉద్యోగులకు ఒక విజ్ఞప్తి
ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ఇంకా దర్యాప్తు పూర్తికాలేదని, తుది నివేదిక వచ్చేంత వరకు ఊహాగానాలు చేయవద్దని సంస్థ ఉద్యోగులను క్యాంప్‌బెల్ కోరారు. ‘‘సన్సెషనలిజం కోసం కొత్త కొత్త వార్తలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా, మనం మన పనిపై దృష్టిపెట్టాలి. సమగ్రత, అత్యుత్తమం, ప్రయాణికులపై దృష్టి, కొత్తదనం, టీం వర్క్ ఇవే మన బలాలు. గత మూడేళ్లుగా సంస్థ కొనసాగిస్తున్న ఆదర్శాలతో ముందుకుసాగాలి’’ అని క్యాంప్‌బెల్ విల్సన్ ఉద్యోగులకు సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిరిండియాలోని అన్ని బోయింగ్ 787 విమానాలను పరీక్షించామని, అవన్నీ ఉపయోగించేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నట్టు టెస్టులో తేలిందని ఆయన ప్రస్తావించారు.
Read Also- Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. ఇదెలా సాధ్యమైంది?
ఏఏఐబీ రిపోర్టులో ఏముంది?
జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. విమానం కూలిన బేజీ మెడికల్ కాలేజీకి చెందిన 30 మందికి పైగా విద్యార్థులు కూడా బలయ్యారు. ఇక ప్రాథమిక రిపోర్టు ఈ మధ్యే విడుదలైంది. ఫ్యూయల్ స్విచ్‌లు రెండూ ఆఫ్ చేసి ఉన్నాయని, అనంతరం ఇంజిన్లను రీస్టార్ట్ చేయాలని ప్రయత్నం జరిగినట్టు నివేదిక పేర్కొంది. విమానాన్ని పక్షి ఢీకొన్నట్టు, లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలూ లేవని 15 పేజీలతో కూడిన నివేదికలో ఏఏఐబీ పేర్కొంది. అయితే, ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, వెలుగులోకి రావాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయని కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు.