YS Jagan: హెడ్డింగ్ చూడగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంత పెద్ద పని ఏం చేశాడబ్బా? అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ..! అవును కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఆయన తనయుడు నారా లోకేష్‌లను (Nara Lokesh) ఉద్దేశిస్తూ వెలసిన ఒక ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఎంత పని సేచ్చి వయ్యా జగనూ..!’ అనే పేరుతో తెగ వైరల్ అవుతోంది. బాబు, లోకేష్‌లు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం కడప జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఉన్న వివరాలేంటో చూసేద్దాం రండి.
కిక్కురు మనకుండా..!
‘ ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనకు.. సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే, ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా..? తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ (Kadapa Arts College) వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా! నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.
Read Also- Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. ఇదెలా సాధ్యమైంది?
ఫ్లెక్సీలో ఉన్న విషయాలివే..
వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదన్నది వైసీపీ అభిప్రాయం! అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు.
ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు.

Read Also- Nimisha Priya: నిమిషా ప్రియాకు ఎల్లుండే ఉరి.. ఏమీ చేయలేమన్న కేంద్రం
నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ! నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!
కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ! నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ! నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది. కాగా, కడపలో ఇలాంటి ఫ్లెక్సీలు కనిపించడం కొత్తేమీ కాదు.
Read Also-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్.. తారక్ ఆరోగ్యంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం