Mohammed Siraj: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ రంజుగా మారింది. రసవత్తరంగా మారిన ఈ మ్యాచ్‌లో (Mohammed Siraj) చివరి రోజైన ఇవాళ (సోమవారం) ఫలితం తేలనుంది. అయితే, ఆట నాలుగో రోజైన ఆదివారం చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది. దీంతో, మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయించింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత సిరాజ్ అతడి ముందుకెళ్లి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ సెలబ్రేట్ చేయడం వివాదానికి దారితీసింది. దీంతో, సిరాజ్‌పై తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టేర్ కుక్ ఐసీసీని అభ్యర్థించాడు. విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ వివాదాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి సిరాజ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు తేల్చింది. మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది.
Read Also- Nimisha Priya: నిమిషా ప్రియాకు ఎల్లుండే ఉరి.. ఏమీ చేయలేమన్న కేంద్రం
అసలేం జరిగింది?
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఉదయం ఈ వివాదాస్పద ఘటన జరిగింది. మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసి బెన్ డకెట్, ఓల్లి పోప్ వికెట్లు పడగొట్టాడు. అయితే, డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత, సిరాజ్ అతడికి అతి సమీపానికి వెళ్లి సెలబ్రేట్ చేశాడు. అతడి వైపు చూస్తూ కాస్త దూకుడుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఇద్దరూ భూజాలతో ఢీకొన్నారు. ఆటలో ఈ చర్య ద్వారా సిరాజ్, ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ నిబంధన ప్రకారం, బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అతడ్ని అపహాస్యం చేయడం, రెచ్చగొట్టేలా ప్రేరేపించేలా వ్యవహరించడం నిషేధం. క్రమశిక్షణా చర్యల కింద మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు 1 డీమెరిట్ పాయింట్ కూడా విధిస్తారు. సిరాజ్ గత 24 నెలల్లో చేసిన రెండో తప్పిదం కావడంతో అతడి ఖాతాలోని డీమెరిట్ పాయింట్లు 2కి చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం, 24 నెలల వ్యవధిలో ఒక ఆటగాడు 4 లేదా అంతకన్నా ఎక్కువ డీమెరిట్ పాయింట్లకు గురైతే ఆటగాడిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది.
Read Also- Viral News: 3 నెలల్లోనే సిటీ వదిలి వెళ్లిన యువకుడు.. అతడు చెబుతున్న కారణాలివే
భౌతికంగా తాకడాన్ని సహించలేం
మహ్మద్ సిరాజ్ దూకుడు వ్యవహార ఘటనపై ఇంగ్లండ్ మాజీ క్రికెట్ అలిస్టెర్ కుక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఆమోదయోగ్యమైన ఘటన కాదని పేర్కొన్నాడు. డకెట్ కావాలనే వచ్చి తగిలాడా అనే అనుమానం ఉన్నా, సిరాజ్ ఒక ఆటగాడి ముఖానికి మూడు అంగుళాల దూరంలో నిలబడి అరవడమంటే అది తప్పేనని వ్యాఖ్యానించాడు. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు, కానీ, ఫిజికల్ కాంటాక్ట్ మాత్రం అక్కర్లేదు అని విమర్శించాడు. సిరాజ్ హద్దు దాటాడని, ఈ చర్యకు తగిన శిక్ష ఉండాలని పేర్కొన్నాడు. టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కార్యక్రమంలో కుక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటన పక్కన పెడితే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా మారింది. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.