Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొనబోతున్న కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే నర్సు వ్యవహారంపై భారత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం తెలియజేసింది. నిమిషా ప్రియా కేసులో భారత ప్రభుత్వం తరపున పెద్దగా చేయగలిగేది ఏమీ లేదని అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి చెప్పారు. ‘‘ఇది చాలా బాధాకరం. కానీ, మనం చేయగలిగినంత చేశాం. ఇంతకుమించి ఏమీ చేయలేం. ప్రస్తుతం మన చేతుల్లో ఒకే ఒక్క మార్గం ఉంది. నిమిషా ప్రియా చేతిలో హత్యకు గురైన బాధిత యెమెన్ వ్యక్తి కుటుంబం ‘బ్లడ్ మనీ’ (నష్టపరిహారం) స్వీకరించాలనుకుంటే మాత్రమే ఆమెను మనం రక్షించగలం ’’ అని జడ్జిలు విక్రమ్ నాథ్, సందీప్ మెహ్తాకు అటార్నీ జనరల్ వివరించారు. నిమిషా ప్రియాను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ తరఫు న్యాయవాది ఇదే తరహా నిస్సహాయతను వ్యక్తం చేశారు.
నష్టపరిహారం తిరస్కరణ
యెమెన్‌కు చెందిన మృతుడి కుటుంబానికి ఇప్పటికే సుమారు 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.5 కోట్లు) ఇస్తామని ఆఫర్ చేసినా బాధిత కుటుంబం అంగీకరించలేదు. నష్టపరిహారాన్ని తిరస్కరించారు. ఇది వారి గౌరవానికి సంబంధించిన అంశంగా భావిస్తున్నారని, అందుకే నష్టపరిహారానికి అంగీకరించడంలేదని న్యాయమూర్తులకు అటార్నీ జనరల్ వివరించారు.
Read Also- Martian meteorite: వేలానికి అంగారక గ్రహ శకలం.. ధర ఎంత?
ఆర్థిక సాయం చేయలేం
ఇది చాలా సంక్లిష్టమైన కేసు అని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అవసరమైనన్ని చర్యలు తీసుకుందని, ఇక ప్రభుత్వ పరంగా చేసేందుకు ఏమీలేదని వివరించారు. కేంద్రం తరపున అన్ని ప్రయత్నాలూ చేశామని, బయటకు తెలియకుండా అనేక ప్రయత్నాలు చేశామని, అయితే, ఈ విషయంలో ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయని వివరించారు. ఒకవేళ మృతుడి కుటుంబం నష్టపరిహారానికి అంగీకరిస్తే, సాయపడతారా? న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన మద్దతిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పందించిన అటార్నీ జనరల్, ఈ తరహా పరిహారాలు అందించడం వ్యక్తిగతం అవుతుందని, ప్రభుత్వం తరఫున సాయపడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడేందుకు ప్రతినిధిని పంపించాలంటూ నిమిషా ప్రియా కుటుంబ సభ్యులు అభ్యర్థించినా ప్రభుత్వం చేయగలిగేది ఏమీలేదని పేర్కొన్నారు. ఇప్పటికే యెమెన్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సైతం కేంద్ర ప్రతినిధులు మాట్లాడినట్టు అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వివరించారు. మరణశిక్ష వాయిదా పడుతుందని సమాచారం ఉన్నప్పటికీ, అది ఎంతవరకు నిజమో స్పష్టత లేదని పేర్కొన్నారు. ఇదంత ఆషామాషీ వ్యవహారం కాదని, ప్రభుత్వానికి పరిమితులుంటాయని పునరుద్ఘాటించారు.
Read Also- Viral News: 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం.. అంత ఆనందం ఎందుకంటే?
అసలు ఏంటీ కేసు?
2008లో నిమిషా ప్రియా ఉద్యోగం కోసం యెమెన్ వెళ్లింది. నిమిషా ప్రియా యెమెన్‌లోని పలు ఆసుపత్రుల్లో పని చేసింది. ఆ తర్వాత, సొంతంగా క్లినిక్ ప్రారంభించింది. స్థానిక చట్టాల ప్రకారం, యెమెన్ పౌరుడు ఒకర్ని ఆమె క్లినిక్ నిర్వహణలో భాగస్వామిగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ వ్యాపార భాగస్వామి పేరు తలాల్ అబ్దో మెహ్దీ (37). ఇతను నిమిషా ప్రియాను వేధింపులకు గురిచేశాడు. డబ్బులు తీసుకోవడమే కాదు, నిమిషా పాస్‌పోర్టును కూడా బలవంతంగా లాక్కొని అతడి వద్ద పెట్టుకున్నాడు. పాస్‌పోర్టు ఎలాగైన వెనక్కి తీసుకోవాలని భావించిన నిమిషా 2017లో తలాల్ అబ్దో మెహ్దీకి ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్నాక పాస్‌పోర్టు తీసుకెళ్లాలని భావించింది. కానీ, దురదృష్టవశాత్తూ అతడు చనిపోయాడు. దీంతో, యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ నిమిషా ప్రియా అరెస్ట్ అయింది. స్థానిక చట్టాల ప్రకారం నిమిషాకు మరణశిక్ష పడింది. యెమెన్ సుప్రీంకోర్టు కూడా మరణ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత, యెమెన్ అధ్యక్షుడు కూడా మరణశిక్షకు ఆమోదముద్ర వేశారు. మరణశిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. జూలై 16న (బుధవారం) ఆమెను ఉరి తీసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. చివరి ప్రయత్నంగా బాధిత కుటుంబం ‘బ్లడ్ మనీ’ స్వీకరించడానికి అంగీకరిస్తే మాత్రమే నిమిషా ప్రియా ప్రాణాలు బయటపడుతుంది. లేదంటే, ఉరిశిక్షను ఎదుర్కోవాల్సిందే.