Palm Wine Shops Seized: కూకట్ పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు సృష్టించిన విషాదం నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కల్లు డిపోలపై దాడులు చేస్తున్నారు. శాంపిళ్లను సేకరిస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. కల్లులో కల్తీ జరిగిందని నిర్ధారణ అయిన కల్లు కంపౌండ్లను సీజ్ చేస్తున్నారు. నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ చర్యలు తాత్కాలికమేనా? ఇక ముందు కూడా కొనసాగుతాయా? అన్నది ప్రశ్నగానే మిగిలింది. మహబూబ్ నగర్లో ఇలాగే కల్తీ కల్లు సేవించి కొంతమంది చనిపోయినపుడు ఓ నెలపాటు హడావిడి చేసిన ఎక్సయిజ్అధికారులు ఆ తరువాత గప్చుప్అయిపోయారు. దీనికి కారణం కల్లు డిపోల నిర్వాహకుల నుంచి భారీ మొత్తాల్లో ఆమ్యామ్యాలు అందుతుండటమే కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక, కల్తీ కల్లు మాఫియాకు కొందరు రాజకీయ నేతల అండదండలు ఉండటం మరో కారణమన్న ప్రచారం ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పుణ్యమే.
కల్తీ కల్లు ఏరులై పారుతుండటానికి కారణం బీఆర్ఎస్ప్రభుత్వమే అని జనం అంటున్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కల్లు డిపోలపై కఠినమైన ఆంక్షలు ఉండేవి. యాభై కిలోమీటర్ల పరిధిలో ఈత, తాటి చెట్లు లేకపోతే ఆయా ప్రాంతాల్లో కల్లు కంపౌండ్లు తెరవటానికి అనుమతులు ఇచ్చేవారు కాదు. దాంతో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో ఉన్న కల్లు కంపౌండ్లు అన్నీ అప్పట్లో మూతబడ్డాయ. అయితే, బీఆర్ఎస్(BRS) 2014లో అధికారంలోకి వచ్చాక యాభై కిలోమీటర్ల నిబంధనను ఎత్తి వేసింది. దాంతో గ్రేటర్ హైదరాబాద్ తోపాటు యాభై కిలోమీటర్ల పరిధిలో ఈత, తాటి చెట్లు లేని ప్రాంతాల్లో కల్లు కంపౌండ్లు వందల సంఖ్యలో ప్రారంభమయ్యాయి.
డబ్బు సంపాదనే లక్ష్యం
ఇక, కల్లు డిపోలు నడుపుతున్న వారు డబ్బు సంపాదనే లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీని కోసం కల్తీ కల్లును తయారు చేసి అమ్ముతున్నారు. యాభై లీటర్ల అసలు కల్లులో ఆల్ఫ్రాజోలెం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫాం కలిపి అయిదు వందల లీటర్ల కల్లు తయారు చేస్తున్నారు. ఇక, ఈ కల్లు ఒక్కసారి తాగిన వారు దానికి పూర్తిగా బానిసలవుతున్నారు. మరుసటి రోజు కల్తీ కల్లు దొరకకపోతే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కరోనా(Covid) లాక్ డౌన్ సమయంలో కల్తీ కల్లు దొరకక కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రుల్లో వీరిని మంచాలకు గొలుసులతో కట్టి మరీ చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Kaleshwaram Water Flow: ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి
ఆమ్యామ్యాలు
ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఇటు పోలీసులుగానీ..అటు ఎక్సయిజ్ అధికారులుగానీ పట్టించుకున్న పాపానికి పోవటం లేదు. దీనికి కారణం ప్రతీ నెలా ఠంచనుగా ఆమ్యామ్యాలు అందుతుండమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు కొన్నిరోజులు దాడులు తనిఖీల పేర హడావిడి చేయటం కొంతమందిని అరెస్ట్ చేయటం చేస్తున్నారు తప్పితే ఈ కల్తీ కల్లు మహమ్మారిని శాశ్వతంగా అంతం చేయటానికి చర్యలు తీసుకోవటం లేదు. గతంలో టీజీ న్యాబ్ఛీఫ్ గ్రేటర్హైదరాబాద్ లోని అన్ని కల్లు కంపౌండ్లపై దాడులు జరిపించి 70కి పైగా డిపోల నుంచి శాంపిళ్లు సేకరించారు. వీటిని నారాయణగూడలోని ఎక్సయిజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్షలు జరిపించగా 58 కల్లు కంపౌండ్లలో కల్తీ జరుగుతున్నట్టుగా నిర్ధారణ కూడా అయ్యింది. ఈ క్రమంలో వాటన్నింటిపై చర్యలు తప్పవని అందరూ అనుకున్నారు. అయితే, తెర వెనక ఏం జరిగిందోగాని అక్కడితో ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడటం గమనార్హం.
రాజకీయ నేతల అండదండలు
దీనికి కారణం కొంతమంది రాజకీయ నేతలే అని ఎక్సయిజ్అధికారులే చెబుతున్నారు. ప్రతీ జిల్లాలో కీలకమైన నాయకులకు ప్రతీనెలా కల్లు డిపోల నిర్వాహకుల నుంచి డబ్బు చేరుతుందన్నారు. ఈ క్రమంలో తాము దాడులు చేస్తే ఆ వెంటనే సదరు నాయకుల నుంచి ఫోన్లు వస్తాయని చెప్పారు. వారి మాట వినకపోతే ట్రాన్స్ఫర్లు చేయిస్తారన్నారు. లూప్ లైన్లకు పంపిస్తారని వివరించారు. దాంతో తాము నిస్సహాయ స్థితిలోకి పడి పోతున్నామన్నారు.
ఆ నిబంధనను అమల్లోకి తేవాలి
కల్తీ కల్లును అరికట్టాలంటే యాభై కిలోమీటర్ల పరిధిలో ఈత, తాటి చెట్లు లేని ప్రాంతాల్లో కల్లు డిపోలకు అనుమతి ఇవ్వొద్దన్న డిమాండ్జనం నుంచి వస్తోంది. ఇంతకు ముందు అమల్లో ఉన్న ఈ నిబంధనను మళ్లీ తీసుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతగా పని చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఈ డిమాండ్‌పై సీఎం(CM) స్పందిస్తారని ఆశిద్దాం.
Also Read: BC Reservation: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంబురాలు