Damodar Rajanarsimha: కల్తీ కల్లు విక్రయాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) హెచ్చరించారు. కూకట్‌పల్లి (Kukatpally) కల్తీ కల్లు ఘటనలో బాధితులు చికిత్స పొందుతున్న (Nimes Hospital) నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిమ్స్‌లో 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
నలుగురికి డయాలసిస్ జరుగుతుందని, నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Village Panchayats: గ్రామ పంచాయతీల సమగ్ర ప్రణాళిక.. రాష్ట్రంలోని గ్రామాల వివరాల సేకరణ
కర్ణాటక చిన్నారికి చేయూత..
తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కర్ణాటక చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) చేయూతనందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలను కాపాడారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలో నివసిస్తూ, ఓ హోటల్‌లో పనిచేస్తున్నారు. వారి 8 ఏళ్ల కుమార్తె ఐశ్వర్య తరచు అనారోగ్యానికి గురవడంతో స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. పాపకు గుండె జబ్బు ఉందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు తెలిపారు.
ఆపరేషన్ కోసం కనీసం రూ. 5 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో చంద్రకాంత్ దంపతులు ఆందోళన చెందారు. కర్ణాటకకు చెందిన కుటుంబం కావడంతో వారికి ఆరోగ్యశ్రీ కార్డు గానీ, రేషన్ కార్డు గానీ లేవు. వారి ఆధార్ కార్డులు కూడా కర్ణాటకకు చెందినవే ఉన్నాయి. ఈ పరిస్థితిలో బాధిత కుటుంబం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది. వారి పరిస్థితికి చలించిపోయిన మంత్రి, వెంటనే పాపను నిమ్స్‌లో అడ్మిట్ చేయించాలని, అవసరమైన ఆపరేషన్ చేసి పూర్తి చికిత్స ఉచితంగా అందించాలని ఆదేశించారు.
ఈ నెల 4వ తేదీన గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపాల్, డాక్టర్ ప్రవీణ్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఐశ్వర్యకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. పాప పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. గురువారం చంద్రకాంత్ దంపతులు తమ పాప ఐశ్వర్యతో కలిసి సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ పాప ప్రాణాలు కాపాడిన దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: Nayanthara: భర్తతో విడాకులు.. మరోసారి సంచలన పోస్ట్ పెట్టిన నయనతార?
కల్లులో కల్తీ నిజమే.. పరీక్షల్లో నిర్ధారణ
ఆరుగురి ప్రాణాలను బలిగొన్న కల్లులో కల్తీ జరిగినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో స్పష్టంగా నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు నలుగురు కల్లు డిపో నిర్వాహకులను అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారు. ఈ నెల 5, 6వ తేదీల్లో హైదర్ నగర్, ఇంద్రానగర్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగిన హైదర్ నగర్, నిజాంపేట, షంషీగూడ, నడిగడ్డ తండా, ఇందిరాహిల్స్ తదితర ప్రాంతాలకు చెందిన ముప్పై మందికి పైగా కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పితో వేర్వేరు ఆస్పత్రుల్లో చేరిన వీరిలో స్వరూప, మౌనిక, సీతారాం, బొజయ్య, నారాయణమ్మ, సత్యనారాయణ అనే ఆరుగురు మరణించారు. ఈ ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 5, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు నమోదయ్యాయి. అధికారులు హైదర్ నగర్, దానికి అనుబంధంగా ఉన్న హెచ్‌ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, కేపీహెచ్‌బీలోని భాగ్యనగర్ తదితర కల్లు డిపోల నుంచి 350 మిల్లీలీటర్ల చొప్పున శాంపిళ్లను సేకరించారు. దీంతో పాటు 674 లీటర్ల కల్లును సీజ్ చేశారు. ఈ కల్లు శాంపిళ్లను నారాయణగూడలోని ఎక్సైజ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
పరీక్షల్లో నిర్ధారణ..
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిపిన పరీక్షల్లో భాగ్యనగర్ కల్లు దుకాణం మినహా మిగిలిన కల్లు డిపోల్లో విక్రయించిన కల్లులో ప్రమాదకరమైన ఆల్ఫ్రజోలం రసాయనాన్ని కలిపినట్లు నిర్ధారణ అయింది.
లైసెన్సుల రద్దు..
ఈ క్రమంలో ఆయా కల్లు డిపోల నిర్వాహకులైన కూన రవితేజ గౌడ్, కూన సాయితేజ గౌడ్, చెట్టుకింది నాగేశ్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్‌ను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఆల్ఫ్రజోలం కలిపిన కల్లును విక్రయించినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో హైదర్ నగర్, దానికి అనుబంధంగా ఉన్న హెచ్‌ఎంటీ కాలనీ, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు డిపోల లైసెన్సులను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు