Vijayawada: ప్రస్తుత సమాజంలో వీధి కుక్కలు సైతం భాగమయ్యాయి. అవి లేని వీధి లేదంటే అతిశయోక్తి ఉండదు. ఆడపా దడపా చిన్నారులు, మనుషులపై దాడి చేసినట్లు వార్తలు వచ్చినా.. చాలా వరకు వీధి కుక్కలు మనుషులతో మమేకమై జీవిస్తుంటాయి. దొంగలు, అగంతకులు వంటి వారు తమ ఉన్న ఏరియాలోకి ప్రవేశించకుండా అవి అడ్డుకుంటూ ఉంటాయి. ప్రజలు పట్టించుకోకపోయినా సమాజానికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్న వీధికుక్కలపై ఓ అగంతకుడు పైశాచికంగా ప్రవర్తించాడు. ఏకంగా 7 వీధి కుక్కల చావుకు కారణమయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఈ దారుణం జరిగింది. కానురు వరలక్ష్మీ పురంలోని వీధుల్లో కొన్ని కుక్కలు అనుమానస్పదంగా చచ్చి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. తొలుత నిద్రపోతున్నాయని భావించిన స్థానికులు.. వాటిని పట్టించుకోలేదు. అయితే గంటలు గడుస్తున్నా అవి ఏమాత్రం కదలకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. దగ్గరకి వెళ్లి చూడగా అవి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అయితే గుర్తు తెలియని అగంతుకుడు.. వాటికి విషం కలిపిన ఆహారం పెట్టాడని తెలుస్తోంది. దీంతో వీధిలోని 7 కుక్కలు ప్రాణాలు కోల్పోయాయని సమాచారం.
జంతు ప్రేమికులు ఫైర్!
మూగజీవాలను పొట్టన పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కలతో ఏదైనా సమస్య ఉంటే.. మున్సిపాలిటీ వారికి సమాచారం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అంతేకానీ ఇలా తినే ఆహారంలో విషం కలిపి చంపడమేంటని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలపై ఇంత పైశాచికంగా వ్యవహరించిన వారు.. నిజ జీవితంలో ఇంకెలా ఉంటారో ఊహించవచ్చని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. బాధ్యులను అరెస్ట్ చేసి.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Rajinikanth: ఇండస్ట్రీలోనే తొలిసారి.. రిస్క్ చేయబోతున్న రజినీకాంత్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే
వీధి కుక్కల ప్రయోజనాలు తెలుసా?
సాధారణంగా వీధి కుక్కల మనకు ఏం మేలు చేస్తాయిలే అని చాలా మందిలో అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వీధి శునకాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో నేరాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా దొంగలు.. కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు తేలింది. కుక్కలు లేని ప్రాంతాలతో పోలిస్తే అవి అధికంగా ఉండే ఏరియాల్లో ప్రజలు కాస్త సేఫ్ గా ఫీలవుతున్నట్లు స్పష్టమైంది. వీధి శునకాలు ఉన్న ఏరియాలో మహిళల మెడలో గొలుసు దొంగిలించడం అంత తేలిగ్గా ఉండటంలేదట. శునకాలు అధికంగా ఉండే ఏరియాలో పిల్లుల సంచారం తక్కువగా ఉంటోందని.. దీంతో తమ ఇళ్లల్లోని పాలు, పెరుగు రక్షించబడుతున్నాయని పలువురు స్త్రీలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది.