Harish Rao on KCR: రంజాన్ తోఫా ఇచ్చి ముస్లింల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందే కేసీఆర్ (KCR) అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారని, షాదీ ముబారక్, కేసీఆర్ (KCR) కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందించారన్నారు. అంతేకాదు దేశంలో మొదటిసారి ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనమిచ్చి గౌరవించిన రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ఆయన తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) ముస్లిం మైనార్టీలతో సమావేశం నిర్వహించారు.
Also Read: Vijay Deverakonda: హీరో ట్యాగ్‌లపై… విజయ్ దేవరకొండ అలా అన్నాడేంటి!
4వేల కోట్లు
ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ, తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ (Jubilee Hills) వైపు చూస్తున్నదన్నారు. కాంగ్రెస్ (Congress) ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని, 4వేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తామని, ఇమామ్, మౌజన్లకు 5 వేల నుంచి 12 వేలకు పెంచుతామని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ 25 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు.
లక్షా 12 వేల మంది
ఇందులో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని నిలదీశారు. ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్తా లేరన్నారు. లక్షా 12 వేల మంది పేద మైనార్టీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కేసీఆర్ అందించారన్నారు. రంజాన్ తోఫా, కేసీఆర్ (KCR) కిట్టు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఓవర్సీస్ స్కాలర్ షిప్ బంద్ అయిందన్నారు. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదని మండిపడ్డారు.
మళ్ళీ బీఆర్ఎస్‌దే అధికారం
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది (BRS Party) బీఆర్ఎస్ పార్టీనే అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్‌లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు. హైడ్రా, మూసీ పేర్లతో ముస్లింల ఇళ్లను కూల్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. కూల్చిన ఇండ్లకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదన్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్లను ఇవ్వలేదు కానీ ఉన్న ఇళ్లను కూలగొట్టాడని మండిపడ్డారు. పొద్దుతిరుగుడు పువ్వు లాగా రేవంత్ రెడ్డి బీజేపీ చుట్టూ తిరుగుతుంటాడన్నారు. అందరం కలిసి పనిచేసి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు.
Also Read: HYDRAA: ‘బతుకమ్మ’ను బతికించిన హైడ్రా.. ఎలా సాధ్యమైంది?