Nallapureddy Issue
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: నల్లపురెడ్డి బూతులు వినసొంపుగా ఉన్నాయా జగన్?

YS Jagan: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. జాతీయ మీడియాలో సైతం ఈ వార్తలు రావడంతో అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్థితి..? పదే పదే మహిళలను వైసీపీ నేతలు ఎందుకు ఇంతలా అవమానిస్తున్నారు? అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం ఖండించకపోగా.. కూటమి సర్కార్‌ తీవ్ర వ్యాఖ్యలు, అంతకుమించి ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ క్యాడర్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) ఇంటిపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడి చేశారు. భారీగానే ఆస్తి నష్టం వాటిల్లిందని వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన రెండ్రోజులుగా రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ అయ్యింది. అటు టీడీపీ సైతం తీవ్రంగా స్పందించింది. ‘ ఎప్పటి మాదిరిగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది. జగన్ ఆదేశాల ప్రకారం ఉచ్ఛం నీచం మరిచి ఆ బూతు స్క్రిప్ట్‌ను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చదివారు. అది విని ఎప్పటి మాదిరిగానే ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు జగన్. కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు’ అని తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోస్తోంది.

చంపేస్తారా..?
చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని జగన్ మండిపడ్డారు.

Read Also- Gambhira Bridge: ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు

ఎందుకీ కుట్రలు?
చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మహిళా నేతలు తిట్టిపోస్తున్నారు. ‘ నీది నోరా.. మురుగు కాలువా? ఒక మహిళపై ఇంత కక్షా! అదే మహిళపై దారుణంగా ఓడినా బలుపు తగ్గలేదు’ అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు.. తమ మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతపై కోవూరు మహిళలు తిరగబడ్డారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ, జగన్‌ రెడ్డిని ప్రశ్నిస్తూ మంగళవారం నాడు భారీ ర్యాలీ చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నల్లపురెడ్డి బూతులను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్రంగా ఖండిస్తుండటం గమనార్హం. ‘ ఇలాంటి వాళ్లను వెంటబెట్టుకోనేనా 2029 ఎన్నికలకు వెళ్లేది..? నీకో దండం ఈసారి కష్టమే పో. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని విమర్శించినందుకే 2024 ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో మరిచిపోయారా..? తమరు మారేదెప్పుడు మహాప్రభో..? అని అభిమానులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఇదేం న్యాయం?
మరోవైపు.. వైఎస్ జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డిని ఈ మంచి ప్రభుత్వం ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు..? అని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి ఘటనపై ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ.. నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ మాది దాడుల సంస్కృతి కాదు. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారు. వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చు. ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు నాది ఒకటే ప్రశ్న. నల్లపురెడ్డి నాపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు మీ ఇంట్లో మహిళలకు చూపించండి. నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్‌ సీరియస్‌గా తీసుకోవాలి’ అని ప్రశాంతిరెడ్డి కోరారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని అటు జనసేన, బీజేపీ నుంచి కూడా గట్టిగానే డిమాండ్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Read Also- Indian Nurse: యెమెన్‌లో భారత నర్సుకు ఉరి శిక్ష.. ఏం చేసిందంటే?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?