– మరోసారి కవిత కస్టడీ పొడిగింపు
– ఇప్పటికే సీబీఐ కేసులో ఈనెల 20 వరకు పొడిగించిన కోర్టు
– ఈడీ కేసులోనూ అదే రోజుకు కంటిన్యూ
– 14 రోజులు పొడిగించాలన్న ఈడీ
– 6 రోజుల వరకే ఓకే చెప్పిన న్యాయస్థానం
– 224 పేజీలతో మరో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
– ఈనెల 20న విచారిస్తామన్న కోర్టు
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కిన ఊరట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కడం లేదు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆరు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
14 రోజులు అడిగిన ఈడీ
ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో తిహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ కావేరి బవేజా ముందు కవితను హాజరుపరిచారు అధికారులు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. అయితే, ఆరు రోజులకే అంగీకరించింది న్యాయస్థానం. ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది. రెండు కేసుల్లోనూ కస్టడీ 20 వరకు కంటిన్యూ అయింది.
Also Read: Polling Percentage: నాలుగో విడత పోలింగ్ 67.71 శాతం
మరో సప్లిమెంటరీ చార్జిషీట్
ఈ కేసులో ఈడీ ఆరో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 8 వేల పేజీల ఈ చార్జిషీట్‌ను 224 పేజీలకు కుదించినట్టు పేర్కొంది. ఈ సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశాన్ని ఈనెల 20వ తేదీన విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులోనే తిహార్ జైలులో ఉన్న ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అనుమతి ఇచ్చింది. జూన్ 1న తిరిగి లొంగిపోవాలని స్పష్టం చేసింది. కానీ, ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం దండయాత్ర చేస్తున్నారు. కానీ, దర్యాప్తు సంస్థలు ఆమే కింగ్ పిన్, బెయిల్ ఇవ్వొద్దని వాదిస్తున్నాయి.