Temple Lands: ఆలయ భూములు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. వాటిని అడ్డుకునేందుకు అధికారులు వెళ్తే ఆక్రమణదారులు దాడులు చేస్తున్నారు. శాఖకు ప్రత్యేకంగా ప్రొటెక్షన్ కోసం సిబ్బంది గానీ, (Police) పోలీసులు గానీ లేకపోవడంతో దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆ భూముల వైపు వెళ్లాలంటేనే అధికారులు జంకుతున్నారు. అదే ప్రభుత్వం శాఖకు ప్రత్యేకంగా పోలీస్ (Police) సిబ్బందిని నియమిస్తే దాడులను నియంత్రించే అవకాశం ఉంది. కానీ, ఆ దిశగా మంత్రి కూడా చొరవ తీసుకోవడం లేదని, పలు మార్లు విన్నవించినా స్పందన కరువైందనే ఆరోపణలు ఉన్నాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే
రాష్ట్రంలో 87235.39 ఎకరాలు ఆలయ భూములు (Temple Lands) ఉన్నాయి. మండల స్థాయి అధికారుల చోద్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే గతంలో 20124.03 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయి. అయితే, ఉన్న భూమిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఫిర్యాదు వస్తే అక్కడికి వెళ్లి అడ్డుకోవాల్సి ఉంది. అయితే, ఆ ప్రొటెక్షన్ సెల్‌లోని అధికారులకు ప్రభుత్వం రక్షణ కోసం సిబ్బందిని కేటాయించలేదు. పోలీసుల ప్రొటెక్షన్ లేదు. దీంతో భూ ఆక్రమణకు అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై ఆక్రమణ దారులు దాడులు చేస్తున్న పరిస్థితి నెల కొన్నది. తరచూ ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కరువైందనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: CM Revanth Reddy: జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ!
అధికారులకు రక్షణ కరువు
ఇతర రాష్ట్రాల్లో 6వేల ఎకరాలు దేవాలయ భూమి ఉంది. ఆ భూమి ఎక్కడుందో తెలియదు. దానిని గుర్తించేందుకు అధికారులు వెళ్లాలంటే వారికి రక్షణ లేదని సమాచారం. మరోవైపు సర్వేయర్ల కొరత సైతం ఉంది. అంతేగాకుండా పోలీస్ (Police) ప్రొటెక్షన్ అడిగితే ఆ సమయాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనలు ఉంటే ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో అధికారులు ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఇదే విషయాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు సైతం అధికారులు వివరించినట్లు సమాచారం. కబ్జా అవుతున్నట్లు ఫిర్యాదు వస్తే సంబంధిత భూమి దగ్గరకు వెళ్తే ఆక్రమణదారులు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మంత్రి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని, సిబ్బందిని నియమించలేదని పలువురు పేర్కొంటున్నారు. మంత్రి స్పందించి సిబ్బంది నియామకం చేపట్టాలని అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
రాములోరి భూములో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు
రాష్ఠ్ర విభజన సమయంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములుండగా ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండడంతో భద్రాచలం టెంపుల్ సిబ్బంది అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో తరచూ ఘర్షణ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు1,300 ఎకరాల భూమి ఉంది. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్టంగా 889.5 ఎకరాలు ఉంది. ఈ భూమిలో ఎక్కువ భాగంగా ఇప్పటికే ఆక్రమణకు గురైంది.
పురుషోత్తపట్నంలోకి ప్రవేశించే మార్గంలో నిర్మాణ పనులు చేపడుతున్నారన్న సమాచారంతో ఆలయ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈవో రమాదేవి అభ్యంతరాలు వినకుండా స్థానికులు ఆమె దాడి చేశారు. గతంలోనూ మహబూబాబాద్ మాటేడులో ఆలయ భూములను ఆక్రమించుకుంటున్నారనే సమాచారం అందడంతో భూమి దగ్గరకు వెళ్లిన దేవాదాయశాఖ అధికారులపై దాడి చేశారు. లంగర్‌హౌస్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమిని కాపాడేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా మంత్రి స్పందించి దేవాదాయశాఖకు ప్రత్యేకంగా పోలీసులు సిబ్బందిని నియమించాలని, భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫెన్సింగ్ వేసేలా చొరవ తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష!