Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, పదవుల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర కేబినేట్ సైతం తాజాగా ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే పక్కా రాష్ట్రాల నుంచి బిహార్ లో స్థిరపడిన మహిళలకు ఈ రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
కేబినేట్ ఆమోదం
బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన తాజాగా కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 43 ప్రతిపాదనలను మంత్రి వర్గం ఆమోదించింది. అందులో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార ఎన్‌డీఏ కూటమికి.. తాజా నిర్ణయం కలిసిరానున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ప్రభావం చూపనున్న నేపథ్యంలో పదవుల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పించడం వ్యూహాత్మక నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
యువజన కమీషన్ ఏర్పాటు
బిహార్ లో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో యువజన కమిషన్ (Bihar Yuvajana Commission) ను ఏర్పాటు చేయాలని కేబినేట్ నిర్ణయించింది. యువత సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ తరహా కమిషన్ ఏర్పాటుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బీపీఎస్సీ (BPSP), యూపీఎస్సీ (UPSC) ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగులకు ఆర్థిక సాయం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.50 వేల గ్రాంట్ తో పాటు రూ.లక్ష స్టైఫండ్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోనుంది.
Also Read: Seethakka on KTR: కేటీఆర్ నాశనమైపోతారు.. మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్!
రైతులకు అండగా..
జులైలో కురిసిన తక్కువ వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు డీజిల్ సబ్సిడి పథకానికి రూ.100 కోట్లను కేబినేట్ మంజూరు చేసింది. దీని ద్వారా ఒక్కో రైతు ఎకరానికి రూ.750 చొప్పున అందుకోనున్నారు. డీజీల్ పై లీటర్ రూ.75 చొప్పున 10 లీటర్లకు ప్రభుత్వం ఈ సబ్సిడీ మెుత్తాన్ని అందించనుంది. దీని ప్రకారం రైతులు 8 ఎకరాల వరకూ సబ్సిడిని పొందవచ్చని కేబినేట్ సూచించింది.