Viral News: తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య యువతీ యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. డిప్రెషన్‌కు లోనుకావడం, వ్యసనాలు.. విద్యా, ఉద్యోగ ఒత్తిళ్లు, లవ్ ఫెయిలూర్స్, సైబర్ బెదిరింపులు ఇలా చెప్పుకుంటూ పోతే యువత ఆత్మహత్యకు చాలానే కారణాలున్నాయి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే వార్త వీటన్నింటికీ భిన్నం. నిజంగా ఈ వార్త చదివిన తర్వాత ‘ రేయ్.. ఎవర్రా మీరంతా..’ అనే సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇదిగో ఫలానా కారణంతో, ఫలానా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని మనం వార్తలు, సోషల్ మీడియాలో ప్రతిరోజూ వింటున్నాం.. చూస్తున్నాం. కానీ ఈ యువకుడు మాత్రం ఏకంగా దేవుడికే లేఖ రాసి.. ఆయన్ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ తిట్టిపోశాడు. దీంతో ప్రస్తుతం లేఖ, యువకుడి గురించే నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ లేఖలో ఏముంది..? ఎందుకింతలా వైరల్ అవుతోంది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..!
Read Also- Tamannaah Bhatia: ప్రభాస్ సినిమాలో ఐటం సాంగ్‌కు ఓకే చెప్పిందా?
అసలేం జరిగింది?
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన 25 ఏళ్ల దీటి రోహిత్ (Rohith) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు దేవుడికి లేఖ రాసి.. తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిజంగా ఇదంతా హృదయ విదారకమే అయినప్పటికీ జనాలు మాత్రం చిత్ర విచిత్రంగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. రోహిత్ ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్నాడు. అయితే, డాక్టర్ అవ్వాలనే తన కల నెరవేరక ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న నా కోరిక నెరవేరింది. చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ’ అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నత విద్యావంతుడైన యువకుడు, తన లక్ష్యం చేరుకోలేక జీవితంపై విరక్తి చెందాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
లేఖలో ఏముంది..?
‘ లోకపాలక, జగత్ మాత, అన్నపూర్ణదేవి కాపాడు.. కరుణించు.. క్షమించు.. నడిపించు.. దయచూపు తల్లి. ఓం నమ: శివాయా.. ఓం నమో నారాయణ నమ:. శివయ్యా (Lord Shiva).. నీకు మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా? మేము నీ కొడుకులం కాదా! ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలనే నా కల దేవుడి దయ వల్ల నెరవేరింది. కానీ నా కలలు, నేను అనుకున్నవి కూలిపోయాయి. చేడో లేదా చావో అని తెలుసు. నేను చావాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే బ్రతికి ఉండటం వల్ల కలిగే బాధ.. చావు వల్ల కలిగే బాధ కంటే ఎక్కువ. నేను చాలా సార్లు ప్రయత్నించి అలసిపోయాను. బహుశా ఇదే నా తలరాత కావచ్చు. ఇప్పుడు నేను నా జీవితాన్ని నీకు పూర్తిగా అప్పగిస్తున్నాను. యేసయ్యా.. నాకు ఇంకెన్ని జన్మలు వద్దు. నేను పూర్తిగా అసంపూర్ణంగా జీవించినప్పటికీ, కనీసం నేను నాకు నిజాయితీగా ఉన్నాను. నేను చాలా మంచి హృదయాలను, స్వచ్ఛమైన ఆత్మలను, నిస్వార్థ వ్యక్తులను కలవడం సంతోషంగా ఉంది. మిగిలిన వాటిని, వారిని మర్చిపోతేనే మంచిది. నా చివరి కోరిక ఏమిటంటే.. నా భౌతిక శరీరాన్ని కాశీలోని ఘాట్ల వద్ద దహనం చేయాలి.. నా ఆత్మ సర్వశక్తిమంతుడైన, విశ్వంతో కలిసిపోవాలి’ అని లేఖలో రోహిత్ ఆవేదన వెలిబుచ్చాడు. చివరిగా.. డాక్టర్ కావాలనే తన కోరిక తీరలేదని బాధపడుతున్నా అని చెబుతూ ఆత్మహత్య లేఖ కింద ‘Dr. D.R.’ అని సంతకం చేయడం అతని అంతిమ కోరికకు గుర్తుగా మిగిలింది.
పంచుకోండి.. పోయేదేముంది!
ఈ లేఖను నిశితంగా పరిశీలిస్తే.. రోహిత్ ఎంతటి మానసిక క్షోభతో ఉన్నాడో, తన కష్టాలకు దేవుడిని నిందించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. తన కలను నెరవేర్చుకోలేకపోయిన ఆవేదన ఈ ప్రశ్నల ద్వారా వ్యక్తం చేశాడు. ఇది అతను తన జీవితాన్ని ఎంత నిస్సహాయంగా భావించాడో, చివరి కోరికగా ఆత్మహత్య లేఖ రాయడాన్ని ఎంచుకున్నాడో అనేది అర్థమవుతుంది. జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, పోరాటాలు అతన్ని ఎంతగా అలసిపోయాడో, బ్రతకడం చావు కంటే పెద్ద శిక్షగా భావించాడో లేఖను బట్టి తెలుస్తోంది. ఈ ఘటన మానసిక ఆరోగ్యంపై అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తుంది. యువత తమ ఆశయాలు నెరవేరనప్పుడు లేదా తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు, తమ భావాలను పంచుకోవడానికి, సహాయం కోరడానికి వెనుకాడకూడదు. అంతేకాదు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు యువత ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని గుర్తించి, వారికి మద్దతుగా నిలబడటం చాలా అవసరం. లక్ష్యాలను చేరుకోలేకపోయినా, జీవితంలో వేరే మార్గాలు ఉంటాయని, బ్రతకడం విలువైనదని వారికి భరోసా ఇవ్వాలి. ఇలాంటి తీవ్రమైన ఆలోచనలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, దయచేసి వెంటనే సహాయం కోసం సంప్రదించండి. సమస్య ఎంత పెద్దదైనా, పరిష్కారాలుంటాయి. కిరణ్ హెల్ప్‌లైన్ (Kiran Helpline) 1800-599-0019 (మానసిక ఆరోగ్య సహాయం), స్నేహ ఇండియా (Sneha India) +91-44-24640050 (ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్) లేదా మీ దగ్గర్లోని మానసిక ఆరోగ్య నిపుణులు లేదా కౌన్సిలర్లను సంప్రదించండి. జీవితం ఎంతో విలువైనది, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండని నిపుణులు చెబుతున్నారు.
రోహిత్ రాసిన లేఖ ఇదే..
Read Also- Chandrababu: ఎవ్వరినీ వదిలిపెట్లొద్దు.. సీబీఎన్ కీలక ఆదేశాలు