Texas Floods: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోగా.. గల్లంతైన వారి కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వరదల నుంచి ఇద్దరు యువతులు అనూహ్యంగా తమ ప్రాణాలను కాపాడుకున్నారు. వారు ముప్పు నుంచి బయటపడిన తీరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
సహాయక చర్యల్లో భాగంగా టెక్సాస్ లోని కంఫర్ట్ సమీపంలో నది వెంబడి గాలింపు చేస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఇద్దరు యువతులు సజీవంగా కనిపించారు. భూమి నుంచి 27 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు కొమ్మలకు వేలాడుతూ వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ లో సభ్యుడిగా ఉన్న కార్డ్ షిఫ్లెట్ (Cord Shiflet)
ప్రకారం.. వారు చివరిసారిగా కనిపించిన ప్రదేశం ఘటనాస్థలి నుంచి 6 మైళ్ల దూరంలో ఉంది. వారు 24 గంటలకు పైగా చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్నారు. అయితే ఇద్దరు యువతలు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అన్న విషయాలను మాత్రం రెస్క్యూ సిబ్బంది వెల్లడించలేదు.
కారులో మహిళల మృతదేహాలు
అయితే ఇద్దరు యువతులను సకాలంలో గుర్తించి వారిని కాపాడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రెస్క్యూ టీమ్ సభ్యుడు కార్డ్ షిఫ్లెట్ అన్నారు. కష్టపడి వేగంగా రెస్క్యూ పనులు చేయాలన్న ఆలోచనను ఈ ఘటన మరింత బలపరిచిందని చెప్పారు. కనిపించకుండా పోయిన ప్రతీ ఒక్కరి కోసం ప్రార్థనలు కొనసాగించండంటూ ఆయన ఫేస్ బుక్ (Face Book) లో వెల్లడించారు. కాగా తన బృందం ఇప్పటివరకూ 4 మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా.. వారిని కారులో గుర్తించామని అన్నారు. ఇదిలా ఉంటే సెంట్రల్ టెక్సాస్ సంభవించిన వరదలతో ఆదివారం నాటికి కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు. గల్లంతైన కనీసం 30 మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Melania Trump: ట్రంపే అనుకున్నాం.. భార్య కూడా అంతే.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ఆ కౌంటీలో అధిక మరణాలు
ఇదిలా ఉంటే టెక్సాస్ లోని కెర్ కౌంటీ ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది. ఆ ప్రాంతంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రావిస్ కౌంటీ 6, బర్నెట్ కౌంటీ 3, కెండాల్ కౌంటీ 2, విలియమ్సన్ కౌంటీ 1, టామ్ గ్రీన్ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు అకస్మిక వరదల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘వరదలను పెద్ద విపత్తుగా పరిగణిస్తూ సంతకం చేశాను. చాలా కుటుంబాలు ఊహించని విషాధాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు’ అంటూ ట్రూత్ లో ట్రంప్ రాసుకొచ్చారు.