CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహానికి ప్రతివ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రచిస్తున్నారు. చంద్రబాబుతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి (BJP) చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల తీరును తెలంగాణ ప్రజల ముందు ఎండగడుతూ దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీ నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ ప్రయోజనాలను వివరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం.
Also Read: Mulugu District: చుక్క రమేష్ ఆత్మహత్యతో చెలరేగిన వివాదం!
ప్రధాన ఎజెండాగా బనకచర్ల
తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీ తరలించుకుపోయేందుకు ఇప్పటికే చంద్రబాబు (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు గోదావరి నీళ్లలో నష్టం జరుగుతుందని, భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తలెత్తుతాయని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నారు. ఈమధ్య ఢిల్లీకి వెళ్లిన సీఎం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేసి ఏపీ చేపడుతున్న బనకచర్లతో తెలంగాణ ప్రయోజనాలకు ఎలా నష్టం జరుగుతుందని వివరించారు. నీటిలో వాటాలు తేల్చాలని కోరారు. అయితే, ఏపీ ప్రభుత్వం బనకచర్లకు పర్యావరణ అనుమతులు కోరడంతో కేంద్రం ఇవ్వలేదు. కానీ, ప్రాజెక్టుపై మాత్రం పట్టుసడలకుండా కృషి చేస్తున్నది.
ఒకవైపు డీపీఆర్, మరోవైపు ప్రాజెక్టుకు కావల్సిన అన్ని అనుమతులు సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో అలర్ట్ అయిన సీఎం సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రజలశక్తి మంత్రి (C.R. Patil)సీఆర్ పాటిల్‌ను మరోసారి కలిసి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరనున్నారు. అదే విధంగా గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలువనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరి అపాయింట్ దొరికినట్లు తెలిసింది. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండనుండడంతో మరికొంతమంది కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అవుతారని సమాచారం. రాహుల్ గాంధీని సైతం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
కూటమికి చెక్ పెట్టేలా..
ఏపీలో చంద్రబాబు కూటమి తెలంగాణలోనూ పాగా వేయాలని భావిస్తున్న తరుణంలో దానికి కూడా చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy భావిస్తున్నారు. అందులో భాగంగానే తొలుత బనకచర్లను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీంతో బీజేపీ, టీడీపీలను ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు నష్టం చేకూర్చుతాయని, ఏపీ ప్రాజెక్ట్ ప్రయత్నాలు చేస్తుంటే ఆ పార్టీలకు చెందిన వారు నోరు మెదపడం లేదని వారికి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి ఇది అని వివరించాలని చూస్తున్నారు. బనకచర్లను ప్రధాన అస్త్రంగా చేసుకొని ముందుకు పోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అదే విధంగా బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు.
అయితే, మూడు నెలలు దాటినా బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. దీనిపై తెలంగాణకు చెందిన బీజేపీ (bJP) ఎంపీలు, మంత్రులు ఉన్నప్పటికీ మాట్లాడటం లేదని కేవలం పదవులు కాపాడుకుంటున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఢిల్లీలో సీఎం న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం. ఏదీ ఏకమైనప్పటికీ ఈసారి సీఎం ఢిల్లీ టూర్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Also Read: Melania Trump: ట్రంపే అనుకున్నాం.. భార్య కూడా అంతే.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!