Gangster: గ్యాంగ్‌స్టర్ పాత్రను మనం సినిమాల్లో చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అలాంటిది రియల్ లైఫ్‌లో చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! అస్సలు ఆ దరిదాపుల్లోకి పోవడానికి కూడా సాహసించం కదూ..! ఆయన్ను కానీ, ఆయన ముఠా.. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను టచ్ చేయడమంటే మామూలు విషయం కానే కాదు. అలాంటిది గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు.. గ్యాంగ్‌స్టర్‌ను టచ్ చేయడమే కాదు.. బాస్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహల్లోకి వెళ్లండి. మాటల్లో చెప్పలేం అంతే..! వాస్తవానికి ఎంత పెద్ద తోపు, తురుము అయినా భార్య ముందు పిల్లే అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. భర్త అంత పెద్ద గ్యాంగ్‌స్టర్ అయినప్పటికీ భార్య మాత్రం భయపడకుండా.. తనకు నచ్చిన వ్యక్తితో ఎఫైర్ నడిపింది. ఇదంతా చూస్తుంటే సినిమా లాగా ఉంది కదూ.. రీల్ కానే కాదండోయ్ రియల్‌గానే జరిగింది. సీన్ కట్ చేస్తే.. ఈ వ్యవహారం అంతా బట్టబయలు అయ్యింది. ఇంత జరిగాక ఆ గ్యాంగ్ ఊరికే ఉంటుందా..? అస్సలు ఉండదుగా. దీంతో ఆ ముఠా సభ్యుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు..!
Read Also- Raghurama: రఘురామ దగ్గర బ్లడ్ బుక్.. బ్యాంక్ బుక్ సంగతేంటి?
ఇదీ అసలు సంగతి..!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇప్పా గ్యాంగ్ చాలా పాపులర్. ఈ గ్యాంగ్‌కు లీడర్ సయ్యద్ షహరుఖ్ (అలియాస్ ఇప్పా). నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నది. ఈ గ్యాంగ్‌లో అర్షద్ టోపి (24) అనే యువకుడు పనిచేస్తుండేవాడు. గ్యాంగ్ లీడర్‌కు 24 ఏళ్ల ముస్కాన్ అనే భార్య ఉంది. అయితే ముస్కాన్-అర్షద్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక వాళ్లిద్దరూ.. గ్యాంగ్, గ్యాంగ్ లీడర్‌ను లెక్కచేయలేదు. ఇరువురూ తరుచుగా ఏకాంతంగా కలుసుకునేవారు. ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరుగుతుండేవారు. జూలై-3న గురువారం నాడు కూడా ఇద్దరూ బైక్‌పైన బయటికెళ్లారు. ఇక్కడే ఊహించని ప్రమాదం చోటుచేసుకున్నది. టోపి-ముస్కాన్ ప్రయాణిస్తున్న బైక్‌ను జేసీబీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో గ్యాంగ్ లీడర్ భార్య తీవ్రంగా గాయపడింది.. కాంప్టీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా సడన్‌గా ముస్కాన్ చనిపోయింది. అయితే అర్షద్ మాత్రం చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. భార్య చనిపోవటంతో గ్యాంగ్ లీడర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. తన భార్యకు, అర్షద్‌తో అక్రమ సంబంధం ఉందని తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయాడు. ముస్కాన్ చావుకు అర్షద్ కారణమని తెలుసుకొని.. అతడ్ని చంపి పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.
సీన్ రివర్స్..!
ఇప్పటి వరకూ ఒక్కటిగా ఉన్న గ్యాంగ్ ఒక్కసారిగా అర్షద్‌కు వ్యతిరేకంగా మారిపోయింది. అతడ్ని వెతికిపట్టుకుని చంపాలని డిసైడ్ అయ్యి గ్రూపు గ్రూపులుగా వెతకడం మొదలుపెట్టింది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న టోపి తనను ఎప్పుడైనా.. ఎక్కడైనా చంపేస్తారని భయపడి తన ప్రాణాలకు ముప్పు ఉందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడి స్టేట్మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. అయితే అర్షద్ రక్షణ కోరాడు కానీ, అధికారికంగా కేసుపెట్టడానికి ఇష్టపడలేదని డీసీపీ కదమ్ మీడియాకు వెల్లడించారు. అనంతరం మూడో కంటికి తెలియకుండా అర్షద్ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఇలా అందర్నీ టోపి అడ్రస్ కోసం వెతుకుతున్నారు. అతడ్ని చంపడమే ఇప్పా గ్యాంగ్ టార్గెట్‌గా పెట్టుకున్నది. అయితే.. ముస్కాన్‌కు ప్రమాదం జరగలేదని, టోపి హత్య చేసి ఉండొచ్చని గ్యాంగ్‌లోని సభ్యులు అనుమానిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ తాము చేసిన దర్యాప్తులో గ్యాంగ్ లీడర్ భార్య ప్రమాదంలోనే మరణించిందా..? లేక హత్యకు గురైందా..? అనేదానిపై ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు.. సుమారు 40 మంది గ్యాంగ్ సభ్యులు అర్షద్ కోసం నగరం, కాంప్టీ శివారు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ అంటేనే భయపడిపోయే పరిస్థితి నుంచి వాడ్ని ఢీకొనడానికి కూడా సిద్ధమై.. భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జా’ అని సినిమా డైలాగ్ పేలుస్తున్నారు.
ప్రేమ పుట్టింది ఇలా..!
అయితే ఇదే స్టోరీ మరో రకంగా కూడా చెబుతున్నారు. ఇప్పా జైలులో ఉన్నప్పుడు, ముస్కాన్‌కు అర్షద్ టోపితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇప్పా జైలు నుంచి విడుదలైన కొద్దిరోజులకే, జూలై 2, 2025న ముస్కాన్ తన ఇంటి నుంచి అర్షద్‌తో కలిసి పారిపోయింది. ఆమె తనతో పాటు రూ.1.25 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తున్నది. అలా పారిపోయిన మరుసటి రోజు, జూలై 3న టోపి-ముస్కాన్ బైక్‌పై వెళ్తుండగా నాగ్‌పూర్‌లోని పార్డి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముస్కాన్ తీవ్రంగా గాయపడి, నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించింది. అర్షద్ టోపికి స్వల్ప గాయాలయ్యాయి. ముస్కాన్ మరణంతో ఇప్పా గ్యాంగ్ సభ్యులు ఇది ప్రమాదం కాదని, అర్షద్ టోపి ముస్కాన్‌ను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. తమ నాయకుడి భార్యను మోసం చేసి, చంపినందుకు అర్షద్ టోపిని చంపేస్తామని గ్యాంగ్ సభ్యులు ప్రతిన బూనారు. సుమారు 40 మంది సాయుధ గ్యాంగ్ సభ్యులు అర్షద్ కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన నాగ్‌పూర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రైమ్ బ్రాంచ్, పోలీసులు నగరంపై నిఘా పెట్టారు. ఎప్పుడేం జరుగుతుందో అని నగర పౌరులు ఆందోళన చెందుతున్నారు. సినిమాను మించి తలపిస్తున్న ఈ క్రైమ్ కథా చిత్రానికి ఎండ్ కార్డు ఎలా పడుతుందో.. పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
Read Also- Thug Life OTT: ‘అన్నా.. నేనెవర్ని’.. ‘థగ్ లైఫ్’ని ఓటీటీలో చూసిన నెటిజన్ పోస్ట్ వైరల్!