- అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
- జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో చర్చలు
- బస్తీల్లో మురుగు సమస్యను పరిష్కరించాలని ఆదేశం
- ఖర్గే వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహం
- ఢిల్లీ లీడర్‌లా కాదు.. గల్లీ లీడర్‌లా మాట్లాడారని ఫైర్
- వరుస వైఫల్యాలతో కాంగ్రెస్‌లో అసహనం
Kishan Reddy: అధికారుల ఇంటి ఎదుట మురుగు ఉంటే ఒక్క నిమిషమైనా ఉండగలరా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్‌లో కిషన్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా సీ బ్లాక్‌లో రోడ్డుపై డ్రైన్ ఓవర్ ఫ్లోతో ఇండ్ల ఎదుట 500 మీటర్ల వరకు మురుగు పేరుకుపోయిందని, కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని కేంద్రమంత్రికి స్థానిక ప్రజలు వివరించారు. అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని చెప్పడంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌తో కిషన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే మురుగు సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో సమస్యను సాల్వ్ చేయాలని, లేదంటే బాగుండదని హెచ్చరించారు.
ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్
బీజేపీ నాయకులనుద్దేశించి ఆడ కాదు, మగ కాదు అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఖర్గే, ఢిల్లీ లీడర్ కాకుండా గల్లీ లీడర్‌లా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ నేతలు అసహనంతో ఉన్నారంటూ చురకలంటించారు. ఇది కాంగ్రెస్ పతనానికి నిదర్శనమన్నారు. 80 ఏళ్ల వయస్సు గల ఖర్గే ఈ స్థాయికి దిగజారుతారని ఎవరూ ఊహించలేదని, ఈ వ్యాఖ్యలు ఆయన సొంతమా, లేక ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్ చదివారా అని ప్రశ్నించారు.
Read Also- Ramachandra Rao: త్వరలో కమలం బహిరంగ సభ.. బీజేపీ స్టేట్ చీఫ్ కసరత్తు
క్షమాపణ చెప్పాలి
1975లో ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి మరీ కాంగ్రెస్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో సవరణలు చేసిందని, పీఠికలో చేర్చిన సెక్యులర్, సోషలిస్ట్ పదాల గురించి బీజేపీ ఏనాడూ ఏమీ అనలేదని గుర్తుచేశారు. 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికలోని మూల అంశాల్లో సోషలిజం, సెక్యులరిజం పదాలు భాగం కాదని, వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కొందరు ఆర్ఎస్ఎస్ పెద్దలు మాట్లాడడం, వారి వ్యక్తిగత అభిప్రాయమని కేంద్రమంత్రి తెలిపారు. దీనిని బీజేపీకి ఆపాదించడం సరికాదన్నారు. ఖర్గే, తనలో గూడుకట్టుకున్న నిరాశ, నిస్పృహలతో అబద్ధాలు వల్లెవేస్తూ మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
Read Also- Samantha:18 ఏళ్ల వయస్సులోనే అతనితో సమంత మొదటి పెళ్లి? .. నాగచైతన్యను రెండో పెళ్లి చేసుకుందా?