Fish Venkat Wife on Prabhas: టాలీవుడ్‌లో కామెడీ విలన్‌గా అలరించిన ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందనే విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఆర్బీఎం ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. అయితే ప్రభాస్ టీమ్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీని సంప్రదించిందని.. రూ.50 లక్షలు సైతం అందించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్ మంచి మనసు మరోమారు బయటపడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిశాయి. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ భార్య స్పందిస్తూ.. ప్రభాస్ సాయానికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
భార్య ఏమన్నారంటే?
ఫిష్ వెంకట్ కు ప్రభాస్ రూ.50 లక్షలు సాయం చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై ఓ యూట్యూబ్ ఛానెల్ ఫిష్ వెంకట్ భార్యను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది కానీ, అది నిజమైన కాలో కాదో కూడా తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. రూ.50 లక్షలు ప్రభాస్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం చూసి తామే షాక్ అయినట్లు చెప్పారు. ప్రస్తుతమైతే తమకు ఎవరూ ఏమి ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. రూ.50 లక్షలు ఇచ్చింది నిజమైతే తాము ఇలా ఎందుకు ఉంటామని.. వెంటనే ఆపరేషన్ చేయించేవాళ్లం కదా? అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. బయట జరుగుతున్న ప్రచారం చూసి తామూ మోసపోయామని ఫిష్ వెంకట్ భార్య అన్నారు.
Also Read: Amarnath Yatra buses collide: అమర్‌నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన.. భక్తులకు గాయాలు.. ఏమైందంటే?
ఫిష్ వెంకట్ కూతురే చెప్పారు!
కాగా శుక్రవారం ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న ఆరోగ్య పరిస్థితిపై సాయం చేయాలని వేడుకుంటున్న వీడియో చూసిన ప్రభాస్ సార్.. తన అసిస్టెంట్‌తో కాల్ చేయించారు. కిడ్నీ ఇచ్చే దాతని చూసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన అమౌంట్‌ని సార్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. కాకపోతే ఇప్పటి వరకు దాత ఎవరూ దొరకలేదు. మా కుటుంబంలోని వారితో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవడం లేదు. నాన్న బ్రదర్స్ ఉన్నారు కానీ వారి హెల్త్ కూడా సరిగా లేదు. ప్రస్తుతం దాత కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ఇక ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఎలా దెబ్బతిందంటే?
శుక్రవారం తన భర్త ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి కూడా నటుడి భార్య మాట్లాడారు. ‘చాలా దీన స్థితిలో ఉన్నాం. పరిచయస్తులు కూడా ఎవరూ ఇటు వైపు రావడం లేదు. కనీసం పలకరించడం కూడా చేయడం లేదు. నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిసైన ఆయనకు.. షుగర్, కాలు ఇన్‌ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పుడు కొందరు సినీ ప్రముఖులు, దాతలు ముందుకు వచ్చి సాయం చేశారు. అప్పుడు తిప్పుకుని ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ మద్యం, ధూమపానం మొదలు పెట్టారు. అదే టైమ్‌లో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తను చెడు అలవాట్లను మానేసినా, స్నేహితులు మళ్లీ ఏం కాదు అంటూ అలవాటు చేశారు. ఆయన రెండు కిడ్నీలు ఎప్పుడో పాడయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు