- అనుమతులు లేకుండా అల్యూమినియం పౌడర్ కంపెనీ
- ఆరెంజ్ జోన్ అంటూ పీసీబీ అవసరం లేదంటూ బుకాయింపు
- జీరో పర్మిషన్స్‌తో 80 శాతం పనులు పూర్తి?
- పులిచింతల ముంపు గ్రామాల్లో ఫ్యాక్టరీల దందా?
- ఫారెస్ట్ భూముల కబ్జాలను కాపాడేదెవరు?
- ఇప్పటికే ఫారెస్ట్ భూముల్లో డెక్కన్, నాగార్జున, మైహోం మైనింగ్?
- ‘‘ది మెటల్ పౌడర్ కంపెనీ వెనుక ఉన్నదెవరు?
- ప్రాణాలు తీసే పాయిజన్ పౌడర్ తయారీపై స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ ఎడిటర్
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Huzurnagar: అవి పులిచింతల ప్రాజెక్ట్ ముంపు గ్రామాలు. నష్టపరిహారం చెల్లించి, పునరావాసాలతో సహా తెలంగాణలోని 13 గ్రామాలు తీసుకున్నారు. 2013లో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 46 టీఎంసీలు నిండితే కానీ, మునక లేని గ్రామాలను సైతం తక్కువ డబ్బులు ఇచ్చి, ఎక్కువ ఖనిజ సంపద ఉన్న భూములను ఖాళీ చేసి పంపించేశారు. 2018 వరకు ఆ నిర్వాసిత గ్రామాల్లో భూములను ఎవరూ పట్టించుకోలేదు. అయితే, సైదిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆయన మేనమామ బ్రహ్మరెడ్డి చక్రం తిప్పారు. ఫారెస్ట్ భూముల్లో పట్టాలను సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. జనం వెళ్లిపోయిన గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీలను పెట్టించి దందాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సాగార్జున సాగర్ దిగవ నుంచి పులిచింతల ఎగువ వరకు కేవలం సిమెంట్ ఫ్యాక్టరీలే 13కి పైగా ఉన్నాయి. వీటిలో మూడు ఫ్యాక్టరీలు ఫారెస్ట్ భూముల్లో ముడి పదార్ధాల మైనింగ్ చేస్తున్నాయి. డక్కన్, నాగార్జున, మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినవిగా సమాచారం. అధికారులు గుర్తిస్తే అంజనీ సిమెంట్ వ్యవహారం కూడా బయటపడుతుందనే చర్చ ఉన్నది. కానీ, అటవీ శాఖ అధికారులు మాముళ్ల మత్తులో ఆ ఏరియాను పట్టించుకోవడం లేదు. గ్రామాలన్నీ పులిచింతల పేరు మీద ఖాళీ కావడంతో చీమలు దూరని చిట్టడవిలా తయారయ్యాయి. దీంతో అక్కడ ఎవరూ ఫోకస్ చేయడం లేదు.
ఎలాంటి అనుమతి లేని అల్యూమిలియం కంపెనీ ఎక్కడిది?
తమిళనాడుకు చెందిన ‘‘ది మెటల్ పౌడర్ కంపెనీ లిమిటెడ్’’ హుజూరునగర్ నియోజకవర్గంలో వెల్లటూర్ గ్రామంలో సర్వే నెంబర్ 488లో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది. ఈ భూమిని బ్రహ్మరెడ్డి పట్టాగా మార్చి అమ్మారని చెబుతున్నారు. ఈ సర్వే నెంబర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా 80 శాతం భవనాలు పూర్తి చేశారు. ఏ చిన్న కాలేజీ నిర్మించినా పీసీబీ అనుమతులు అవసరం. అలాంటిది ఇంత పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినా పొల్యూషన్ బోర్డును కనీసం సంప్రదించలేదు. ఆరెంజ్ జోన్‌లో ఉంది, పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని చెప్పుకుంటున్న ఈ కంపెనీ యాజమాన్యం, సివిల్ పనులు బిల్డింగ్, ప్రహరీ గొడ నిర్మాణం చేయాలంటే కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరమని కూడా పరిగణించ లేదు. దీంతో సదరు కంపెనీ వ్యవహారం వెనుక ఎవరో పెద్ద లీడర్ ఉన్నారనే అనుమానం కలుగుతున్నది. ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లియరెన్స్ కూడా లేకుండానే వ్యవహారం అంతా నడిపిస్తున్నారని, స్థానికంగా ఇదే గ్రామానికి ఆనుకుని ఉన్న కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Dude Movie: ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఊహించని ఓటీటీ డీల్!
కొత్తగా ఏర్పడిన మండల ప్రజలకు ఎటువంటి సమాచారం తెలియకుండా ఇంత పెద్ద ప్రమాదకర పరిశ్రమ ఏర్పాటు చేయడం ప్రజలు చేసుకున్న దురదృష్టం. పబ్లిక్ హియరింగ్ పెట్టలేదు. ప్రజలకు ఎటువంటి ఉద్యోగాలకు హామీ లేదు. ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి. దీని మీద రేపు మేము కోర్టుకి వెళ్ళి మా సమస్య మీద పోరాడతాం – అజ్మీరా పాండు, అడ్వకేట్ హుజూర్ నగర్
మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు ఎందుకు కడుతున్నారు. అవి ఏమిటో అని మేము అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రదేశంలో ఇంతకు ముందు చాలా చెక్ డామ్‌లు ఉండేవి. అవి మయ్యాయి. ఈ భూమి నుండి పంట కాలువలు ఉండేవి. అవే మా జీవనాధారం – మోర్తాల నాగిరెడ్డి, చింతలపాలెం
ఎంతోమంది ఇంజినీరింగ్, ఐటీఐ చేసి ఉన్నాం. మాకు ఉద్యోగాలు లేవు. ఆంధ్రా, తమిళనాడు, ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వారే పని చేస్తున్నారు. మేము ఏం పాపం చేసుకున్నాం. ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మిస్తున్న ఈ పరిశ్రమకు మేము ఎలా మద్దతు పలకాలి – కుడుముల పృధ్వీ, చింతలపాలెం
తెలగాణ తెచుకుందే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాల కోసం. కానీ ఇక్కడ కనీసం గ్రామ పంచాయతీ అనుమతి కూడా లేకుండా, పర్యావరణం, అటవీ శాఖ అనుమతులు లేకుండా ఇంత పెద్ద ప్రమాదకర పరిశ్రమ నిర్మాణం చేపట్టడం ఏంటి? అనుమతులు లేకుండా ఎలా నిర్మాణం చేపడుతున్నారు. వారు మాకు, మా గ్రామానికి, ఈ ప్రాంత వాసులకు ఇస్తున్న హామీలు ఏంటి. దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు రావాలి – ఉసిరికాయల వెంకటేశ్వర్లు, చింతలపాలెం
Read Also- Allu Aravind: ఈడీ విచారణ.. అసలు విషయమేంటో చెప్పేసిన అల్లు అరవింద్..!