Hari Hara Veera Mallu: ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జూలై 3వ తేదీ ఉదయం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో, ఫ్యాన్స్ కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా ట్రైలర్‌ను స్క్రీనింగ్ చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమా రూపు రేఖలు మారుతాయని నిర్మాత ఏమ్ రత్నం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ట్రైలర్‌ని వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టీమ్‌ని మెచ్చుకుంటున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- AM Rathnam: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల వేళ.. అభిమానులకు నిర్మాత విన్నపం!
‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం
ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల క్రింద నలిగిపోతున్న సమయం
ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం’ అంటూ ఓ గంభీరమైన వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powe Star Pawan Kalyan) మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడిగా ‘వీరమల్లు’ పాత్రలో కనిపించిన ప్రతి షాట్ వావ్ అనేలా ఉంది. ఫ్యాన్స్‌కు అయితే పూనకాలే. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఆ విషయం ఈ ట్రైలర్‌లో కూడా స్పష్టమయ్యేలా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అద్భుతంగా ట్రైలర్‌ని కట్ చేశారు. ఇక డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అలా పడ్డాయి పంచ్‌లు. ఈ ట్రైలర్‌లో కనిపించే ప్రతి పాత్ర ప్రభావవంతంగా ఉంది. ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఈ ట్రైలర్ ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తుంది. ఈ ట్రైలర్ తర్వాత నిజంగానే ఈ సినిమాను చూసే కోణం మారుతుందనడంలో అస్సలు అతిశయోక్తి లేనే లేదు. ఒక్కటే మాట.. వీరమల్లు విధ్వంసం మొదలు.. పులుల్ని వేటాడే బొబ్బులి దిగుతోంది.
Also Read- Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్’ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా ఉందో చూశారా?
క్రిష్ జాగర్లమూడి నుంచి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని చూపించారు. ఆయన కష్టం ప్రతి షాట్‌లో కనిపిస్తోంది. ఈ చిత్ర విడుదల వేళ క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని అందించినట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఓవరాల్‌గా అయితే ఇద్దరు దర్శకులు తమ ప్రతిభను చాటారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి మరోసారి డ్యూటీ ఎక్కేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్ వంటి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులందరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేసినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా అయితే, వెయిట్ చేసినా అద్భుతమైన ఫలితం అయితే ఫ్యాన్స్‌కి దక్కబోతుందనే ఫీల్‌ని ఇవ్వడంలో ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వంద శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటూ రెడీ అయిపోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు