Niharika Konidela: నటిగా గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela).. నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు ఆమె నిర్మించిన ఒకే ఒక్క చిత్రంతో సక్సెస్‌నే కాదు.. అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు, చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ తెచ్చిపెట్టింది. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో ఇప్పుడు రెండో సినిమాకు శ్రీకారం పడింది. ఆ వివరాల్లోకి వెళితే..
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై (Pink Elephant Pictures) ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. మానస శర్మ కథను సమకూర్చిన ఈ చిత్రానికి.. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల సంయుక్తంగా అందిస్తున్నారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిడి వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read- Adivi Sesh: ‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఎందుకు తప్పుకుందంటే.. అసలు విషయం చెప్పేసిన శేష్!
ఈ చిత్ర ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుందని టీమ్ వెల్లడించింది. ఫాంటసీ, కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా, రాజు ఎడురోలు సినిమాటోగ్రాఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), నయన్ సారిక (Nayan Sarika), వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి వంటి వారంతా నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు