High Court On Shami: టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార్య హసీన్ జహాన్ (Hasin Jahan)తో విడాకుల నేపథ్యంలో కలకత్తా హైకోర్ట్ (Calcutta High Court) కీలక తీర్పు వెలువరించింది. భార్య, బిడ్డ ఖర్చుల కోసం ఇవ్వాల్సిన భరణాన్ని భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. భార్యతో పాటు కూతురు ఐరా ఖర్చుల కోసం ప్రతీ నెల రూ.4 లక్షలు భరణంగా చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ తీర్పు ఇచ్చారు.
భరణం భారీగా పెంచుతూ..
టీమిండియా పేసర్ షమీ తన భార్య హసీన్ జహాన్ కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల సందర్భంగా నిర్ణయించిన భరణాన్ని మరింత పెంచాలని కోరుతూ ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జులై 1 ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి అజయ్ కుమార్ ముఖర్జీ (Ajay Kumar Mukharjee) విచారణ చేపట్టారు. స్టార్ క్రికెటర్ గా షమీకి వస్తున్న ఆదాయం, భార్య బిడ్డల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని భరణాన్ని రూ.4 లక్షలకు పెంచుతూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. భార్య హసీన్ జహాన్ వ్యక్తిగత అవసరాల కోసం నెలకు రూ. 1.5 లక్షలు, అలాగే కుమార్తె ఐరా సంరక్షణ, ఖర్చుల కోసం నెలకు రూ. 2.5 లక్షలు కలిపి మొత్తం రూ. 4 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. విడాకులు తీసుకున్న 2018 నుంచి (ఏడేళ్ల కాలం) నుంచి ఈ భరణం వర్తిస్తుందని చెప్పారు. దీని వల్ల గత బకాయిలను కూడా షమీ చెల్లించాల్సి ఉంటుంది.
గత తీర్పును సవాల్ చేస్తూ..
2018లో షమీ దంపతుల విడాకుల కేసును విచారించిన కోలకత్తాలోని అలిపోర్ సెషన్స్ కోర్ట్.. భరణానికి సంబంధించి తీర్పు వెలువరించింది. భార్య ఖర్చుల నిమిత్తం రూ.50,000, కుమార్తె కోసం రూ.80,000 చెల్లించాలని ఆదేశించింది. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హసీన్ జహాన్.. నెలకు రూ.10 లక్షల భరణం (తనకు రూ.7 లక్షలు, కుమార్తెకు రూ.3 లక్షలు) కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తీర్పును పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. షమీ ఆదాయాన్ని పరిశీలించింది. అతడి భారీ రాబడిని దృష్టిలో ఉంచుకొని భరణం పెంచాలని నిర్ణయించింది. హసీన్ జహాన్ తిరిగి వివాహం చేసుకోకపోవడం.. కుమార్తెతో కలిసి జీవిస్తుండటాన్ని గమనించి భరణాన్ని రూ.4 లక్షలకు పెంచుతూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
Also Read: Viral News: ఇదేం విచిత్ర రోడ్డు సామీ.. కాంట్రాక్టర్ ఎవరో గానీ దండేసి దండం పెట్టాలి..!
2014లో వివాహం
షమీ – హసీన్ జహాన్ పెళ్లి విషయానికి వస్తే.. వారు 2014లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుకు హసీన్ చీర్ లీడర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమెకు షమీతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి కుమార్తె జన్మించింది. అయితే 2018లో షమీపై హసీన్ జహాన్ వరకట్న వేధింపుల కేసు పెట్టడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తావిచ్చింది. అంతటి ఆగకుండా అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు సైతం చేసింది. అతడు ఓ పాకిస్థాన్ మహిళ నుండి డబ్బు అందుకున్నారని పేర్కొంది. కుటుంబ ఖర్చులకు చెల్లింపులు కూడా ఆపేశాడని ఆరోపించింది. షమీపై భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో అతడి సెంట్రల్ కాంట్రాక్టును సైతం గతంలో బీసీసీఐ నిలిపివేసింది. బోర్డు విచారణలో ఫిక్సింగ్ ఆరోపణలు ఫేక్ అని తేలడంతో కాంట్రాక్ట్ ను పునరుద్ధరించింది.